మహిళల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో.. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, బస్సు షెల్టర్, కలెక్టరేట్ సిబ్బంది కోసం డైనింగ్ హాల్, లేడీస్ లాంజ్, స్త్రీ క్యాంటీన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వాక్యలు చేశారు…
మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యమన్నారు. మహిళల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తని… రాష్ట్రంలోని మహిళలందని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తమ ప్రభుత్వ కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ మహిళల కోసమే ప్రత్యేకంగా అమ్మ ఆదర్శ పాఠశాలలను ప్రారంభించిందని తెలిపారు.
మహిళల కోసం రూ.500 గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని.. ఈ ఏడాది మహిళలకు రూ.25 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం బాగుపడుతుందని వడ్డీ లేని రుణాలు అందిస్తూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందని అన్నారు.
టీజీఎస్ఆర్టీసీ సంస్థలో డ్వాక్రా సంఘాలను భాగస్వామ్యం చేయాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాదు మహిళల భాగస్వామ్యంతో ఖమ్మంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం మహిళా సంఘాలకు 20 వేల కోట్లకు పైగా వడ్డీ లేని రుణాలు మహిళలకు ఇప్పించడం జరుగుతుందని, రాబోయే 5 సంవత్సరాల్లో లక్ష కోట్లు అందిస్తామని దీనికి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని అన్నారు. మహిళలు తీసుకున్న రుణాలతో పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలని, దీనికోసం అవసరమైన శిక్షణ, తోడ్పాటును కూడా ప్రభుత్వమే అందిస్తుందని తెలిపారు.
భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో కూడా మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తామని అన్నారు. మధిరలో ఇందిరా మహిళా డైరీ ఏర్పాటు చేశామని తెలిపారు. మన జిల్లాలో వ్యవసాయ ఆధారితం అధికంగా ఉంటారని, మన దగ్గర పండే పంటలకు అనుగుణంగా చిన్న, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నామని, ఇందులో కూడా మహిళలను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు.