Tuesday, March 21, 2023

Delhi | మీరు ఊచలు లెక్కబెట్టే రోజులు వస్తున్నాయి.. బండి సంజయ్ కు రాష్ట్ర మహిళా మంత్రుల హెచ్చరిక

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ వేట కుక్కలకు తెలంగాణ ఆడబిడ్డలు భయపడరని రాష్ట్ర మహిళా మంత్రులు తేల్చి చెప్పారు. మహిళా, శిశు, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితపై చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… ప్రజాస్వామ్యంలో అనుచిత వ్యాఖ్యలకు చోటు లేదన్నారు. సంజయ్ అధ్యక్షుడు అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయని, ఆయన అధ్యక్షుడుగా ఉండడం మహిళల దురదృష్టకరమని వాపోయారు. ఉద్యమ నేత బిడ్డగా తండ్రి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ సాంస్కృతిని ప్రపంచనికి చాటిన వ్యక్తి కవిత అని, తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించారని ఆమె గుర్తు చేశారు.

రిజర్వేషన్లు కోసం పోరాడితే అవాకులు చవాకులు పేలుతున్నారని, హైదరాబాద్ లో ధర్నా ఎందుకోసం? రిజర్వేషన్లు వద్దనా అని సత్యవతి ప్రశ్నించారు. తమకు మహిళ సంక్షేమం, రక్షణ, అభివృద్ధి ముఖ్యమని అన్నారు. తాము నడుపుతున్న షీ టీమ్స్ గురించి ఇతర రాష్ట్రాలు నేర్చుకొని  వెళ్లాయని చెప్పారు. బీజేపీకి అరాచకాలు, సంస్కారం లేని మాటలే గుర్తుకు వస్తాయని ఆమె విమర్శించారు. హైదరాబాద్ మహానగరాన్ని పాలించే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళకు ఇచ్చారని, తల్లి గర్భంలో నుంచి కాటికి వెళ్లే వరకు అనేక రకాలుగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని సత్యవతి వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో మా గిరిజన బిడ్డలు గ్రామాలను పాలించుకునే స్థితికి వచ్చారని, మహిళా సమాజం తల దించుకునేల బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతమా పార్టీ పరమైనవా అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
   

బండి సంజయ్ కి భార్య తల్లి, పిల్లలు లేరా అని ఆమె నిలదీశారు. దేశాన్ని దోచుకున్న దొంగలను ప్రధాని మోదీ పక్కన పెట్టుకున్నారని ఆమె మండిపడ్డారు. వారి మీదకు సీబీఐ పోదు… ఈడీ పోదని మంత్రి ఆరోపించారు. ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐని వేటకుక్కల మాదిరిగా పంపిస్తారని,  పార్టీలో చేరగానే అన్ని కేసులు మాఫీ అవుతాయని మండిపడ్డారు. ఇవన్నీ ఈడీ కేసులు కాదు మోడీ కేసులని ప్రజలకి తెలుసని అన్నారు. బిజెపి మెడలు వంచే రోజు, పాతాళానికి పంపే రోజులు దగ్గరకు వచ్చాయని జోస్యం చెప్పారు. 2018 ఎన్నికల్లో బీజేపీ 119 స్థానాల్లో 100 స్థానాలకు పైగా డిపాజిట్ రాలేదని, 2023 లో కూడా 100 స్థానాల్లో డిపాజిట్ రాదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ వంటి వారిని రాజకీయ బహిష్కరణ చేయాలని, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా మాట్లాడే గవర్నర్, సంజయ్ వ్యాఖ్యలపై ఏం మాట్లాడుతారని అందరు చూస్తున్నారన్నారు. అనంతరం సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… బీజేపీ రెండు సార్లు మేనిఫెస్టోలో మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి తర్వాత ఆ ఊసే ఎత్తలేదన్నారు.

మహిళా బిల్లు దీక్ష కు పలు పార్టీలు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు మద్దతు తెలిపాయని, పరోక్షంగా కోట్ల మంది తమ సంఘీభావం తెలిపారని చెప్పారు. తెలంగాణలో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సంతోషం వ్యక్తం చేశారు. 1,13,000 వార్డు సభ్యుల్లో 59వేల మహిళ వార్డు సభ్యులు ఉన్నారని, 6,844 మహిళ సర్పంచ్ లు ఉన్నారని, 3,330 మహిళ ఎంపీటీసీలు ఉన్నారని, 300 పైచిలుకు మహిళ జెడ్పిటిసిలు ఉన్నారని, 349 మంది ఎంపిపిలున్నారని ఆమె వెల్లడించారు.  రిజర్వేషన్ లేకపోయినా హైదరాబాద్ మేయర్ మహిళకు ఇచ్చామని, మార్కెట్ కమిటీల్లో 50% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని సబిత చెప్పారు. రాష్ట్రంలో మహిళ సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి 1లక్ష రూపాయలు ఇస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం సీఎం కెసిఆర్ సర్కార్ అని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడైన ఈ పథకం అమలు చేస్తున్నారో బండి సంజయ చెప్పాలని ఆమె నిలదీశారు.

మీరు పాలిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రాంతాల్లో ఇంటింటికి నీళ్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.  వి హబ్ ఏర్పాటు చేసి మహిళలకు సహాయం అందిస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 గురుకులలు ఏర్పాటు చేస్తే 600 కేవలం ఆడబిడ్డల కోసం కేటాయించారని వెల్లడించారు. కెసిఆర్ దేశం మొత్తం తిరుగుతూ తెలంగాణ మోడల్ అమలు చేస్తే ఉనికి కోల్పోతామని భావిస్తున్నారని విమర్శించారు. మహిళలు అంటేనే మోడీకి గిట్టదని అర్థం అవుతోందని మంత్రి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వెన్నంటి ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. దేశ అడబిడ్డల హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నా చేశారని, మహిళలు అందరం ఏకమవుతామని, మహిళా శక్తి చూపిస్తామని సబితా ఇంద్రారెడ్డి హెచ్చరించారు. సంజయ్ వ్యాఖ్యలపై ఎంపీ కవిత మండిపడ్డారు. ఆయనను మెంటల్ ఆసుపత్రికి తీసుళ్లాలని విమర్శించారు. ఆయన తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు ఖండించారు. ఆయన దిష్టిబొమ్మను తెలంగాణ భవన్ లో చెప్పులతో కొట్టి దగ్ధం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement