Wednesday, April 24, 2024

ఎంపీని బురిడీ కొట్టించిన సైబర్‌ నేరగాడు.. బ్యాంకునుంచి రూ.97,699 మాయం..

కర్నూలు, ప్రభన్యూస్‌ బ్యూరో : కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్‌కుమార్‌ని సైబర్‌ మోసగాడు బురిడీ కొట్టించాడు. బ్యాంకు ఖాతా బ్లాక్‌ అయిందని, వాటిని వెంటనే పాన్‌ నంబర్‌తో అప్‌డేట్‌ చేసుకోవాలంటూ సోమవారం ఆయన మొబైల్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. అప్‌డేట్‌ చేసుకునేందుకు మెసేజ్‌ కింద లింక్‌ ఉండడంతో నిజమేనని నమ్మిన ఎంపీ, వెంటనే లింకు ఓపెన్‌ చేసి వివరాలు ఫిల్‌ చేసి సెండ్‌ చేశారు. వెంటనే ఆయన మొబైల్‌కు ఓటీపీ రాగా, ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్‌ కేర్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి ఫోన్‌ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు అడిగి తెలుసుకుని, ఖాతా అప్‌డేట్‌ అయిపోతుందని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి ఓ సారి రూ.48,700, మరోసారి రూ.48,999 విత్‌డ్రా అయినట్టు ఎంపీ మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. అది చూసి ఆశ్చర్యపోయిన ఎంపీ.. సైబర్‌ నేరగాడు తనను బురిడీ కొట్టించినట్టు గ్రహించి, వెంటనే కర్నూలు రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన బ్యాంకు ఖాతా నుంచి సైబర్‌ మోసగాడు మొత్తంగా రూ.97,699 కాజేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్‌ నేరగాడి గురించి ఆరా తీస్తున్నారు. ఢిల్లీకి చెందిన సైబర్‌ నేరగాళ్ల పనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సేవల పేరిట కర్నూల్‌ ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌ కుమార్‌ను బురిడీ కొట్టించి రూ.లక్ష వరకు మాయం చేసిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూల్‌ రెండవ పట్టణ సిఐ శ్రీనివాసులు వెల్లడించారు. ఇప్పటివరకు నిర్వహించిన నేర పరిశోధనలో ఢిల్లీకి చెందిన సైబర్‌ నేరగాళ్ల చేసిన మోసంగా గుర్తించారు. ఇందులో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంబంధిత వ్యక్తులు ఎవరు, ఢిల్లీలోని ఏ ప్రాంతంకు చెందినవారు, ఎంపీకి ఎక్కడి నుంచి ఫోన్‌ చేశారు. వీరికి గతంలో ఇలాంటి నేరాల్లో సంబంధం ఉందా. వీరు పాత నేరస్తుల ఇలా అనేక కోణంలో దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సిఐ శ్రీనివాసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా కర్నూల్‌ నుంచి ఢిల్లీకి ప్రత్యేకంగా ఓ బృందం వెళ్తున్నట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement