Thursday, April 25, 2024

రుణాల ఊబిలో దేశం.. : ఎంపీ నామ నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పుల గురించి ఆయన అడిగిన ప్రశ్నలకు సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మార్చి 31, 2023 నాటికి భారతదేశ మొత్తం అప్పు రూ.155.8 లక్షల కోట్లని ఆమె స్పష్టం చేశారని నామ తెలిపారు. అందులో విదేశీ రుణం రూ. 7.03 లక్షల కోట్ల వరకు ఉండడం బాధాకరమన్నారు.

ఈ లెక్కలు చూస్తే దేశం ఎటు పోతుందో ఆందోళనగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. వివిధ ఆర్ధిక సంస్ధలు,ఏజెన్సీలు, విదేశాల నుంచి భారీ ఎత్తున అందిన కాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం నిందలు మోపుతోందని విమర్శించారు. ఆర్ధిక క్రమశిక్షణ గురించి మాట్లాడే ప్రధాని దేశాన్ని దివాలా తీయించేలా అప్పులు ఎలా చేశారని ధ్వజమెత్తారు. కాగ్ హెచ్చరించినా ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడమేమిటని నామ ప్రశ్నించారు. ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని ఆరోపించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement