Friday, March 29, 2024

ఏటేటా పెరుగుతున్న పెస్టిసైడ్స్‌ వినియోగం.. అత్యధిక వినియోగిస్తున్న రాష్ట్రాల్లో నాలుగో స్థానంలో తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో రైతులు క్రిమిసంహారకాలను మితిమీరి వినియోగిస్తున్నారని పలు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా పెస్టిసైడ్స్‌ ను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. 2014లో రాష్ట్రంలో సగటున 262 మెట్రిక్‌ టన్నుల పురుగు మందులను వినియోగిస్తుండగా ఇప్పుడి ఏకంగా 5వేల మెట్రిక్‌ టన్నులకు చేరడం వ్యవసాయ, పర్యావరణ శాస్త్రవేత్తలను ఆందోళనకు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగడంతో క్రిమిసంహారకాల వినియోగం కూడా భారీగా పెరుగుతోందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా పెస్టిసైడ్స్‌ వినియోగిస్తున్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్‌, ఆ తర్వాతి స్తానంలో పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి.

విచ్చలవిడిగా పురుగుల మందుల వాడకంతో నేలసారం దెబ్బతిని దిగుబడి తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చేలకు కొద్దిపాటి చీడ, పీడ ల లక్షణాలు కనిపించిన వెంటనే పెస్టిసైడ్స్‌ కంపెనీల వ్యాపార ప్రకటనలు చూసి, ఫర్టిలైజర్‌ షాపుల యజమానులు అంటగడుతున్న క్రిమిసంహారకాలను రైతులు విచ్చలవిడిగా పంటలపై చల్లుతున్నారు. ఫలితంగా రైతుకు ఆర్థికంగా పెట్టుబడి వ్యయం పెరగడంతోపాటు నేలసారం దెబ్బతినడం, పంట ఉత్పత్తుల అవశేషాల్లోనూ హా నికారక రసాయనాలు చేరుతున్నాయని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. రసాయన మందుల వాడకం వల్ల దిగుబడులు పెరుగుతాయన్నది వట్టి అపోహ మాత్రమేనని , సీజన్‌లోని వాతావరణ అనుకూల పరిస్థితుల వల్ల దిగుబడులు పెరుగాయని, అయితే అది క్రిమిసంహారకాల వాడకం వల్లనే పెరిగిందని రైతులు భావిస్తున్నారని వ్యవసాయశాఖ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ చెప్పారు.

- Advertisement -

వ్యవసాయశాఖ అధికారుల సూచనల మేరకే క్రిమిసంహారకాలను వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు. వాస్తవానికి క్రిమిసంహారకాల వినియోగం పెరిగినా కొద్దీ క్రమంగా పంట దిగుబడులు తగ్గడంతోపాటు నేల సారం కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఏటేటా సాగులో క్రిమిసంహారకాల వినియోగం పెరుగుతూ వస్తోంది. 2017-18లో 4866 మెట్రిక్‌ టన్నుల వినియోగం కాగా… 2018-19లో 4894 మెట్రిక్‌ టన్నులు, 2019-20లో 4915 మెట్రిక్‌ టన్నులు, 2020-21లో 4986 మెట్రిక్‌ టన్నుల క్రిమిసంహారకాలను రాష్ట్ర రైతులు పంటలపై పిచికారి చేశారు. సహజసిద్దమైన సాగు విధానాలను అవలంభిస్తూ నేల భూసారాన్ని పరిక్షిస్తూ, క్రిమిసంహారకాల వినియోగాన్ని 90శాతం తగ్గించి వ్యవసాయం చేయొచ్చని, తద్వారా భూసారాన్ని కాపాడడంతోపాటు రైతులకు పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని వ్యవసాయశాఖ సూచిస్తోంది.

అయితే పురుగుమందుల వాడకాన్ని తగ్గించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు పీఎం ప్రమాణ్‌ (ప్రధానమంత్రి ప్రమోషన్‌ ఆఫ్‌ అల్టర్నేట్‌ న్యూట్రియంట్స్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ మేనేజ్‌మెంట్‌ ) పేరుతో ప్రత్యామ్న్యాయ పోషకాల వినియోగాన్ని సాగులో ప్రోత్సహించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసినా ఆ పథకం రైతుల వద్దకు చేరడం లేదు. తెలంగాణతోపాటు పలు రాష్ట్రాల రైతులకు అసలు ఆ పథకం ఒకటుంది అని కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement