Wednesday, February 8, 2023

Telangana | సీఎంలను ఇబ్బందిపెడుతున్నారు.. మోదీ ఆదేశాలతోనే గవర్నర్ల రాజకీయాలు: కేజ్రీవాల్​

ఖమ్మం, హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తనకు పెద్దన్నలాంటివారని ఢిల్లి సీఎం అరవింద్‌ కేజ్రివాల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఖమ్మం సభలో ఢిల్లి సీఎం కేజ్రివాల్‌ ప్రసంగిస్తూ ఆస‌క్తికర వ్యాఖ్యలు చేశారు. కంటి వెలుగు అద్భుతమైన కార్యక్రమంగా ఆయన ప్రశంసించారు. రెండు బృహత్‌ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని కేసీఆర్‌ తనకు కల్పించారని, ఇందులో ఒకటి కంటి వెలుగు కాగా, కొత్త కలెక్టరేట్ల నిర్మాణం మరో అద్భుతమని కొనియాడారు. ఢిల్లి వెళ్లిన తర్వాత ఈ కార్యక్రమాలను అమలు చేస్తామని పేర్కొన్నారు.

- Advertisement -
   

కంటి వెలుగు కార్యక్రమం నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నామని, మనం మనం గొడవలు పెట్టుకోవడం కాదు… ఒకరినుంచి మరొకరు మంచిని నేర్చుకోవాలని తెలిపారు. దేశం ఎలా అభివృద్ధి చెందుతుందో, రైతులకు, కార్మికులు ఏం చేయాలనే అంశాలపై ముఖ్యనేతలమంతా కలిసి చర్చించామ‌న్నారు కేజ్రీవాల్‌. కేరళలో విద్య, వైద్య వ్యవస్థలు అద్భుతంగా ఉన్నాయని, తాను చదువుకునే సమయంలో అనేవాళ్లని, కానీ దేశమంతటా ఇలా ఎందుకు లేవని, ఇది ఎవరి తప్పిదమని ఆయన ప్రశ్నించారు.

మోడీ ఇబ్బందులకు గురిచేస్తున్నారు…
రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను మోడీ ఇబ్బందులు పెడుతున్నారని, గవర్నర్లను ఇందుకు వాడుకుంటున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. తెలంగాణ గవర్నర్‌ సీఎం కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ప్రధాని మోడీ ఆదేశాలతోనే గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి ఆటంకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గవర్నర్లు కేవలం కీలు బొమ్మలు మాత్రమే…ప్రభుత్వాలకు, అభివృద్దికి అడ్డుపడటమే గవర్నర్ల పని అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ల వ్యవస్థను బీజేపీ భ్రష్టు పట్టించిందని, తమిళనాడు, ఢిల్లి తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో దేశ ప్రజలంతా గమనిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధి పనులకు అడ్డుకాలు వేయడమే గవర్నర్ల పనా అని కేజ్రీవాల్ నిలదీశారు. రాష్ట్రాల పాలనా వ్యవహారాల్లో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటోందని ప్రశ్నించారు. తమకు పడనివారిపై సీబీఐ, ఈడీ, ఐటీలను ప్రయోగించి దాడులు చేయిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

మనం ఇంకా వెనుకబడే ఉన్నాం…
మనతోపాటు స్వాతంత్య్రం సాధించుకున్న సింగపూర్‌, జపాన్‌, జర్మనీలు ప్రగతా సాధిస్తుంటే మన దేశం ఎందుకు వెనుకబడిపోయిందన్నారు. ప్రజల హాతం కోసమే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయా అని ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అంతా కలిసి 2024 ఎన్నికల్లో మోడీకి గొప్ప బహుమతి ఇద్దామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఢిల్లి, పంజాబ్‌లో తెలంగాణ పథకాలు అమలు చేస్తాం…
సీఎం కేసీఆర్‌ ఢిల్లిలో పర్యటించి అక్కడ అమలు చేస్తున్న మంచి విధానాలను పరిశీలించి తెలంగాణలోనూ అమలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణలో కంటి వెలుగు షాన్‌దార్‌ కార్యక్రమని, అలాగే తమ రాష్ట్రంలో మోహల్లా క్లినిక్‌లను చూసి తెలంగాణలో భస్తీ దవాఖానాలను అమలులోకి తెచ్చారన్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఢిల్లిdలో ప్రభుత్వ పాఠశాలలను చూసి ఆయన రాష్ట్రంలో అమలు చేశారని తెలిపారు. ఢిల్లిdలో ప్రైవేటు పాఠశాలల విద్యార్ధులు ప్రభుత్వ స్కూళ్లలో చేరుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా దేశం ఇంకా వెనుకబడే ఉంది. మన తర్వాత స్వతంత్య్రం పొందిన సింగపూర్‌ అభివృద్ధిలో దూసుకుపోతోంది.

గవర్నర్లను ఢిల్లినుంచి ప్రధాని మోడీ ఆడిస్తున్నారు. గవర్నర్లకు ఢిల్లి నుంచి ఒత్తిడి ఉంటోంది. సీఎంలను ఇబ్బందులకు గురిచేయడంలో ప్రధాని మోడీ బిజీగా ఉన్నారుఏ. వచ్చే ఎన్నికలు దేశాన్ని మార్చేందుకు ప్రజలకు మంచి అవకాశం అని కేజ్రివాల్‌ పేర్కొన్నారు. ఢిల్లి నుంచి గవర్నర్లకు ఫోన్లు వస్తాయని, సీఎంలను పనిచేయనీయకుండా ఆదేశాలు జారీ చేస్తారని ఆరోపించారు. స్వయంగా మోడీ ఫోన్‌లు చేసి పురమాయిస్తారని, 18గంటలు ఆయనకు ఇదే పని అని విమర్శలు గుప్పించారు. గవర్నర్లు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. వీళ్లు దేశాన్ని బాగు చేసేందుకురాలేదని, 2024 ఎన్నికలను ప్రజలు ఒక అవకాశంగా తీసుకొని మార్పుకు నాంది పలకాలని కేజ్రివాల్‌ ప్రజలను కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement