Saturday, March 16, 2024

ఎన్నికల బహిరంగ ప్రచారంపై నిషేధం.. నెలాఖరు వరకు ఆంక్షలు పొడ‌గింపు..

ఉత్తర్‌ప్రదేశ్ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బహిరంగ ప్రచార కార్యక్రమాలపై అమలవుతున్న నిషేధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఎన్నికల తేదీలు ప్రకటించిన సమయంలోనే కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు వంటి భారీ జనసందోహానికి తావిచ్చే కార్యక్రమాలపై నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కోవిడ్-19 కొత్త కేసుల సంఖ్య, ఒమిక్రాన్ రకం కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నిషేధాజ్ఞలను జనవరి 31 వరకు పొడిగిస్తూ, మొదటి, రెండవ విడత అభ్యర్థుల విషయంలో కొన్ని మినహాయింపులనిచ్చింది. శనివారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర నేతృత్వంలో సమావేశమైన ఎన్నికల సంఘం అధికారులు, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ సహా మరికొందరు ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్స్ విధానంలో కోవిడ్-19 పరిస్థితిపై సమీక్ష జరిపారు. అనంతరం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతోనూ కేంద్ర ఎన్నికల సంఘం వర్చువల్ విధానంలో సమావేశమైంది. ఆ రాష్ట్రాల్లో కోవిడ్-19 తాజా పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా మొదటి, రెండవ విడత పోలింగ్ జరుపుకోబోతున్న ప్రాంతాల్లో అర్హులైనవారికి బూస్టర్ డోసు సహా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఈసీ ఆయా రాష్ట్రాలకు సూచించింది. చీఫ్ సెక్రటరీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా మొదటి, రెండవ విడత ఎన్నికలకు కోవిడ్-19 ఆంక్షలకు లోబడి ఎన్నికల ప్రచారం నిర్వహించుకోడానికి పరిమితులతో కూడిన అనుమతిలిచ్చింది. మొదటి విడత అభ్యర్థుల జాబితా జనవరి 27, 2వ విడత అభ్యర్థుల జాబితా జనవరి 31న ఖరారవుతాయి.

ఈ క్రమంలో ఎన్నికల ప్రచారంపై తీసుకున్న నిర్ణయాలు:

1.జనవరి 31 వరకు రోడ్‌షోలు, పాదయాత్రలు, సైకిల్, బైక్, వాహనాల ర్యాలీలు, బహిరంగ సభలు జరపడానికి వీల్లేదు.

2.మొదటి విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా జనవరి 27న ఖరారుకానున్న నేపత్యంలో, అభ్యర్థులు, ఆయా పార్టీలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 8 వరకు పరిమితులతో సభలు నిర్వహించుకోవచ్చు. స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నిర్థారించిన బహిరంగ ప్రదేశాల్లో సభాస్థలం సామర్థ్యంలో 50% లేదా గరిష్టంగా 500 మంది (ఏది తక్కువైతే ఆ సంఖ్యనే పరిగణలోకి తీసుకోవాలి) వరకు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ సభ జరుపుకోవచ్చు.

3.ఫేజ్-2 అభ్యర్థుల జాబితాల జనవరి 31న ఖరారుకానున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 12 వరకు ఖరారైన అభ్యర్థులు, పార్టీలు పైన చెప్పిన పరిమితులతో ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చు

- Advertisement -

4.ఇంటింటికీ వెళ్లి చేసుకునే ప్రచారానికి ఇప్పటి వరకు గరిష్టంగా ఐదుగురికి మాత్రమే అనుమతి ఉండగా, ఆ సంఖ్యను 10కి పెంచుతూ (భద్రతా సిబ్బంది మినహాయించి) ఈసీ నిర్ణయం

5.హాళ్లలో జరుపుకునే ఇండోర్ సమావేశాలకు హాల్ సామర్థ్యంలో 50% లేదా గరిష్టంగా 300 మంది వరకు అనుమతి

6.వీడియో వ్యాన్లను ఉపయోగిస్తూ చేసే ప్రచార కార్యక్రమాలు సైతం నిర్ధారించిన బహిరంగ ప్రదేశాల్లో సభాస్థలి సామర్థ్యంలో 50% లేదా గరిష్టంగా 500 మందికి మించకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఈ తరహా ప్రచారం చేసుకోవచ్చు.

7.ఎన్నికల్లో పోటీచేస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు తూచా తప్పకుండా అమలు చేయాలి.

8.ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వేదికలను ఎంపిక చేసే విషయంలో జిల్లా ఎన్నికల అధికారిదే తుది నిర్ణయం.

9.జనవరి 8న విడుదల చేసిన మార్గదర్శకాల్లోని మిగతా అన్ని నిషేధాజ్ఞలు యధావిధిగా అమలవుతాయి. సంబంధిత జిల్లా, రాష్ట్రాల అధికార యంత్రాంగాలు ఈ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. తగిన సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షించి, తగు మార్పులు చేర్పులు చేస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement