Thursday, June 1, 2023

రూ.7 కోట్ల వ‌జ్రాభ‌ర‌ణాల‌తో ప‌రారైన కారు డ్రైవ‌ర్..

హైద‌రాబాద్ లో ఓ కారు డ్రైవర్ ఆభ‌ర‌ణాల వ్యాపారి వ‌ద్ద ప‌నిచేస్తూ.. రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలతో పరారయ్యాడు. ఈ ఘ‌ట‌న‌ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని మైహోం భుజ అపార్ట్‌మెంట్స్‌లో ఉండే రాధిక ఆభరణాల వ్యాపారం చేస్తుంటారు. అదే అపార్ట్‌మెంట్స్‌లో ఉండే అనూష రూ.50 లక్షల విలువ చేసే ఆభరణాలను ఆర్డర్ చేశారు. నిన్న సాయంత్రం మధురానగర్‌లో బంధువుల ఇంటికి వెళ్లిన అనూష నగలను అక్కడికే పంపమని చెప్పారు. దీంతో రాధిక తన కారులో డ్రైవర్ శ్రీనివాస్ (26), సేల్స్‌మెన్ అక్షయ్ (30)లతో ఆ నగలను పంపారు. మధురానగర్ చేరుకున్న తర్వాత డ్రైవర్ శ్రీనివాస్ కారులో ఉండగా, అక్షయ్ నగలను తీసుకెళ్లి అనూషకు ఇచ్చి తిరిగి వచ్చి చూస్తే కారు లేదు. సిరిగిరిరాజు జెమ్స్ అండ్ జువెల్లర్స్‌కు ఇవ్వాల్సిన రూ.7 కోట్ల విలువైన వజ్రాభరణాలు కారులోనే ఉన్నాయి. శ్రీనివాస్ ఆ నగలతో పరారైనట్టు అనుమానించిన అక్షయ్ వెంటనే విషయాన్ని రాధికకు తెలియజేశారు. ఆమె ఎస్సార్ నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement