Thursday, April 25, 2024

Delhi | తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబమే శాపం.. దేశ ప్రగతి, అభివృద్ధిని నిర్దేశించే బడ్జెట్ : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేసీఆర్ కుటుంబం ఉన్నన్ని రోజులు రాష్ట్రానికి నష్టమే తప్ప ఏమాత్రం మేలు జరగదని, తెలంగాణకు కల్వకుంట్ల కుటుంబమే పెద్ద శాపమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను భారతదేశ బడ్జెట్‌గానే చూడాలే గానీ కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కాదని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై బీఆర్‌ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంపై కిషన్ రెడ్డి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న విషయాలను చూడలేని స్థితిలో కల్వకుంట్ల కుటుంబం ఉందని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.

రీజనల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ ఖర్చులో సగం కేంద్రం ఇస్తామని చెప్పినా, మిగతా సగం కూడా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదని ఆరోపించారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణంలో భూసేకరణ ఖర్చు రాష్ట్రాలు భరిస్తాయని, ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు కేంద్రం భరిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ ఖర్చులో కూడా సగం భరిస్తామని కేంద్రం ముందుకొచ్చినా రాష్ట్ర సర్కార్ నుంచి స్పందన లేదన్నారు. ఎంఎంటీఎస్ ఫేజ్-2కు రాష్ట్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని, 3 వేల మందికి ఉపాధి కల్పించే రైల్వే ఓవర్హాలింగ్ యూనిట్ మంజూరు చేయిస్తే, అప్రోచ్ రోడ్ ఇవ్వడం లేదని తెలిపారు. రూ. 6 కోట్ల ఖర్చుతో కట్టిన యూరియా ప్లాంట్ ప్రారంభోత్సవానికి కూడా ప్రభుత్వం తరఫున ఎవరూ రాలేదని వెల్లడించారు. సైన్స్ సిటీ మంజూరు చేసుకుని ల్యాండ్ కోసం లెటర్ల మీద లెటర్లు రాసినా స్పందన లేదని, కనీసం లెటర్ అందినట్టు జవాబు కూడా లేదని ఆయన విమర్శించారు.

సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా రూపొందిన బడ్జెట్
భారతదేశ గతం, వర్తమానాలను పరిగణనలోకి తీసుకుంటూ ఉజ్వలమైన భవిష్యత్తును కాంక్షిస్తూ నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారని కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి స్వప్నమైన ‘అమృత్ కాల్’ నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు వేస్తున్న ముందడుగు దేశాన్ని అన్నిరకాలుగా సిద్ధం చేసే దిశగా ఈ బడ్జెట్‌కు ప్లానింగ్ జరిగిందన్నారు. బడ్జెట్ అంటే రూపాయి రాక, రూపాయి పోక, అంకెల గారడీ అనే అభిప్రాయాలను పక్కన పెడుతూ ప్రజా సంక్షేమాన్ని, దేశాభివృద్ధిని జోడెడ్ల బండిగా ముందుకు తీసుకెళ్లేలా బడ్జెట్ కు రూపకల్పన జరిగిందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కలలుగన్న అంత్యోదయ, మహాత్మాగాంధీ కలలుగన్న రామరాజ్యం, గరీబ్ కల్యాణ్, సహకార విధానాన్ని, మన రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలైన మహిళలు, యువత సాధికారత, పారిశ్రామిక అభివృద్ధి ఆధునిక సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, రక్షణ, మౌలికవసతుల కల్పన, పర్యాటకాభివృద్ధి ఇలా ప్రతి రంగాన్ని స్పృశిస్తూ.. భారతదేశ సమ్మిళిత అభివృద్ధి (ఇన్-క్లూజివ్ గ్రోత్) లక్ష్యంతో ఈ బడ్జెట్ ను రూపొందించారని ఆయన చెప్పారు.

- Advertisement -

ప్రభుత్వ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు సంకల్పించి ప్రతినెలా ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామకపత్రాలు అందజేస్తున్నామని.. ఆగస్టు నాటికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈపీఎఫ్ఓలో రిజిస్ట్రేషన్లు తాజాగా 27 కోట్ల మార్కును దాటడం, 47 కోట్ల జన్ ధన్ అకౌంట్లు, 44 కోట్ల మంది పీఎం సురక్ష, జీవన్ జ్యోతి బీమా పథకాల్లో భాగస్వాములు కావడం వంటి అంశాలన్నీ ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, కిసాన్ సమ్మాన్ నిధి స్వయం సహాయక బృందాల సాధికారతకు జరుగుతున్న ప్రయత్నం, తదితర అంశాలను కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు. పారిశుద్ధ్య కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు మ్యానువల్ స్కావెంజింగ్ కు బదులుగా మెషీన్ స్కావెంజింగ్ కు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రతి పట్టణం, నగరంలోనూ మిషనరీ ద్వారా స్కావెంజింగ్‌కు ఈ బడ్జెట్‌లో నిర్ణయించడం స్వాగతించదగిన పరిణామమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలకు నిలువ నీడనిచ్చే పీఎం ఆవాస్ పథకానికి నిధులను 66శాతం పెంచడం కూడా బడ్జెట్ లో ప్రత్యేకమైన అంశమన్నారు.

హైదరాబాద్‌లో తాళపత్ర మ్యూజియం
ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, శిలాశాసనాలను డిజిటలైజ్ చేసే ‘భారత్ శ్రీ’ పథకంలో భాగంగా హైదరాబాద్ లో ఎపిగ్రఫీ మ్యూజియంను ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన సిద్ధమైందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. గతంలో ఎన్నడూ లేనంతగా రైల్వేలకు రికార్డు స్థాయిలో 2.02 లక్షల కోట్ల రూపాయలను కేటాయించడం.. రైల్వేల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 2013-14తో పోలిస్తే ఇది 9 రెట్లు ఎక్కవని ఆయన పేర్కొన్నారు. దేశంలో 50 పర్యాటక ప్రాంతాలను ఎంపికచేసి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ఈ బడ్జెట్లో ప్రత్యేక దృష్టి పెట్టారని, దీని ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటకం జోరందుకుంటుందని ఆయన పేర్కొన్నారు.

దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగం పెరిగిందని.. 2022లో రూ.126 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. విపక్షాలు ఎంత రాద్ధాంతం చేసిన ప్రజలు తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు అండగా నిలబడుతున్నారని ఆయన తెలిపారు. ఆదాయపు పన్ను రిబేటును 5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచడం మధ్య తరగతి ప్రజలకు వరమని.. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ ఈ స్థాయిలో టాక్స్ బ్రాకెట్ పెంపు జరగలేదన్నారు. ఈశాన్య రాష్ట్రాల బడ్జెట్‌ను కూడా గతేడాది ఉన్న రూ.2,755 కోట్ల నుంచి ఈసారి 5,822 కోట్లకు పెంచారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి గతేడాది దాదాపు రూ.76వేల కోట్లున్న బడ్జెట్ ఈసారి లక్షకోట్లకు చేరే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement