Saturday, May 21, 2022

ఆందోళనలు విరమించం, గొటబాయ గద్దె దిగాల్సిందే.. విక్రమసింఘే నియామకం రాజ్యాంగ విరుద్ధం

శ్రీలంకలో కొత్త ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఆందోళనలు సద్దుమణగలేదు. ప్రస్తుత దేశాధ్యక్షుడు గొటబాయ పదవినుంచి వైదొలిగేవరకు ఆందోళనలు విరమించేది లేదని ఉద్యమకారులు స్పష్టం చేశారు. టెంపుల్‌ స్ట్రీట్‌లోని ప్రధానమంత్రి అధికార నివాసం ఎదుట శుక్రవారం కూడా వారు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానిగా ఎవరు అధికారం చేపట్టినా పట్టించుకోబోమని, తమ లక్ష్యమల్లా గొటబాయసహా ఆయన బంధువర్గం గద్దె దిగాల్సిందేనని, అంతవరకు ఆందోళనలు విరమించబోమని స్పష్టం చేశారు. మరోవైపు శుక్రవారం దేశవ్యాప్తంగా శాంతియుతంగా వారి ప్రదర్శనలు కొనసాగాయి. ఇదిలా ప్రధానిగా రణిల్‌ నియామకం రాజ్యాంగ విరుద్ధమని, అందువల్ల ఆయనకు మద్దతు ఇవ్వబోమని ప్రధాన ప్రతిపక్షాలకు చెందిన నేతలు శుక్రవారం స్పష్టం చేశారు. అధికార శ్రీలంక పొదుజన పెరుమున (ఎస్‌ఎల్‌పీపీ), ప్రధాన ప్రతిపక్షం సమగి జన బలవెగయ (ఎస్‌జేపీ)లోని ఒకవర్గం ప్రధాని రణిల్‌కు మద్దతు ఇస్తాయని, పార్లమెంట్‌లో మెజారిటీ నిరూపించుకునేందుకు ఎటువంటి ఆటంకం ఉండబోదని విశ్వసిస్తున్నారు. అయితే తాజా పరిణామాలు రణిల్‌కు వ్యతిరేకంగా మారుతున్నాయి. రణిల్‌ నియామకం రాజ్యాంగ విరుద్ధమని, అ ందువల్ల ఆయనకు మద్దతు ఇవ్వబోమని ప్రతిపక్ష ఎస్‌జేపీ నేత డిసిల్వా విస్పష్టంగా ప్రకటించారు. కాగా ఆ పార్టీలో అసమ్మతివర్గం మద్దతు ఉంటుందని ధీమాగా ఉన్న రణిల్‌కు ఇప్పుడు సమస్య ఎదురైంది. అసమ్మతివర్గం నేత హరిన్‌ ఫెర్నాండో కూడా రణిల్‌కు మద్దతు ఇవ్వబోమని, జాతీయ ప్రభుతంలో చేరేదే లేదని స్పష్టం చేశారు. మరోవైపు వామపక్షాలు కూడా రణిల్‌కు వ్యతిరేకంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశాయి. తాజాగా ఎన్నికలు నిర్వహించి ప్రజల మనోభావాలకు అనుగుణమైన ప్రభుత్వం రావాల్సి ఉందని వామపక్ష పార్టీల కూటమి జేఏవీ నేత అనుర దిసనాయకే ప్రకటించారు. కాగా శ్రీలంకలో నూతన ప్రధానిగా రణిల్‌ బాధ్యతలు స్వీకరించడంపై చైనా ఆచితూచి స్పందించింది. ద్వీపదేశంలో సుస్థిరత సాధించేందుకు కొత్త నాయకతానికి సహకరిస్తామని, ఆ దేశంతో తమకు సంప్రదాయ, సన్నిహత సంబంధాలున్నాయని, అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి జావో జిజియాన్‌ పేర్కొంది.

భారత్‌తో కలసి ముందుకు – రణిల్‌
కొలంబో:ఆర్థిక సంక్షోభంలో తల్లడిల్లుతున్న తమకు కష్టకాలంలో భారత్‌ అండగా నిలిచిందని, ఆ దేశంతో మరింత సన్నిహిత సంబంధాల దిశగా అడుగులు వేస్తామని శ్రీలంక నూతన ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రకటించారు. తన హయాంలో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడేలా ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. శ్రీలంక 26వ ప్రధానిగా గురువారం రాత్రి బాధ్యతలు స్వీకరించిన ఆయన కొలంబోలోని ఒక దేవాలయాన్ని సందర్శించారు. అక్కడ పూజలు జరిపిన అనంతరం ప్రధాని కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌తో సంబంధాల పట్ల తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత్‌ నుంచి అందుతున్న అపార సహకారంపట్ల ప్రధాని నరేంద్రమోడీకి ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. సంక్షోభంలోంచి దేశాన్ని గట్టెక్కించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆందోళనకారులు శాంతించేలా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కాగా కొలంబోలోని భారత రాయబారి గోపాల్‌ బాగ్లే రణిల్‌తో శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement