Friday, December 6, 2024

TG – భారీ కుంభ‌కోణానికి రేవంత్​ సర్కారు ప్లాన్ – కేటీఆర్

ఆ కుంభ‌కోణాల‌న్నీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేస్తాం
ఐఏఎస్ అధికారులు రిస్క్‌ చేయొద్దు
కేసీఆర్ ఎంతో గొప్ప‌గా ప‌నిచేశారు
పొంగులేటి అనుకూల కంపెనీకి మూసీ కాంట్రాక్ట్‌ ఇస్తారా?
గోదారి నీళ్లను మూసీకి తరలించే ప్రాజెక్టు
11 కోట్లతో మేమే అన్నింటినీ సిద్ధం చేశాం..
ఇప్పుడు 5,500 కోట్ల ఖర్చుకు టెండర్​ వేస్తున్నారు
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్ర‌హం

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, హైద‌రాబాద్ :
భారీ కుంభ‌కోణానికి సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ తెర‌తీసింద‌ని బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ .. కాళేశ్వరం నీళ్లను గండిపేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట, దీనికోసం ₹ 5,500 కోట్లు ఖర్చు చేస్తారట.. ఇది మ‌రో కుంభకోణమని ఆరోపించారు. కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు ₹11 వందల కోట్లతో అన్ని సిద్ధం చేశామని అన్నారు. కానీ, పెద్ద ఎత్తున కుంభకోణం చేసేందుకే దీన్ని ₹5,500 కోట్లకు పెంచారని అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ను కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మేఘా సంస్థకే ఇవ్వటానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారని చెప్పారు.

- Advertisement -

ఐఏఎస్ అధికారులు రిస్కు చేయొద్దు
ఐఏఎస్ అధికారులు రిస్కు తీసుకోవ‌ద్ద‌ని కేటీఆర్ స‌ల‌హా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు సంతకం పెడితే తాము అధికారంలోకి వచ్చాక విచారణ ఎదుర్కోవ‌ల‌సి ఉంటుంద‌ని, ఉద్యోగాలు ఊడటం ఖాయమని హెచ్చరించారు. ఎక్కడ బిడ్ లు చేస్తున్నారో ఆ సంస్థ పేరు కూడా త‌మ‌కు తెలుసని చెప్పారు..

కుంభ‌కోణాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తా…

ఆరు గ్యారంటీలకు, హామీలు అమలు చేసేందుకు, ఉద్యోగులకు డీఏ ఇచ్చేందుకు కూడా పైసలు లేవని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారని, కానీ మూసీ ప్రాజెక్ట్ కోసం మాత్రం ఆగమేఘాల మీద పనులు చేసే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. దాన్ని కూడా మేఘాకు ఇవ్వ‌డానికి సిద్ధం చేసుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికే మన వద్ద నుంచి మహారాష్ట్ర కు మూటలు పోయాయని, ఢిల్లీకి కూడా ఈ కంపెనీ ద్వారా మూటలు పంపిస్తారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈస్ట్ ఇండియా కంపెనీ అని పేరుపెట్టిన మీరు ఆ సంస్థ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం కుంభకోణాలను ప్రజలకు ముందే వివరిస్తున్నానని తెలిపారు. ఎందుకు మీరు ఈ దోపిడీలు చేస్తున్నారో మాకు తెలుసని అన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేస్తే అధికారుల ఉద్యోగాలు కూడా పోతాయ‌ని హెచ్చరించారు.

కేసీఆర్ ఎంతో గొప్ప‌గా ప‌నిచేశారు…

సాగు నీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారని తెలిపారు. వాయు వేగంతో తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ నిర్మించారని గుర్తు చేశారు. కానీ అప్పట్లో మేఘా ఇంజనీరింగ్ సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కమీషన్ల కోసమే అంటూ రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడారని తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా మేఘా కృష్ణారెడ్డిని పొలిటికల్ మాఫియా అంటూ కామెంట్ చేశారని చెప్పారు. ఏ కంపెనీని ఆంధ్రా కంపెనీ అన్నారో.. ఏ కంపెనీని ఈస్ట్ ఇండియా అన్నారో, ఏ కంపెనీ అరాచక కంపెనీ అన్నారో ఆ కంపెనీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు.

సుంకిశాల ద్వారా హైద‌రాబాద్‌కు నీళ్లు

హైదరాబాద్‌కు నీళ్లు తీసుకురావటానికి సుంకిశాల ప్రాజెక్ట్ చేపట్టామని కేటీఆర్ తెలిపారు. కానీ ఈ ప్రభుత్వం, మున్సిపల్ మంత్రి కూడా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదని అన్నారు. సుంకిశాలలో మేఘా కంపెనీ క్రిమినల్ నెగ్లిజన్స్ కారణంగా రిటైనింగ్ వాల్ కూలిపోయిందని తెలిపారు. ఈ విషయాన్ని అసలు బయటకు తెలియకుండా ముఖ్యమంత్రి సహా ప్రభుత్వం దాచి పెట్టిందని మండిపడ్డారు. ఎందుకు దాచి పెట్టారో చెప్పాలంటూ గతంలోనే డిమాండ్ చేశానని ఆయ‌న గుర్తు చేశారు.

పొంగులేటి అనుకూల కంపెనీకి మూసీ కాంట్రాక్ట్‌ ఇస్తారా?

మంత్రి పొంగులేటికి సంబంధించిన కంపెనీకి మూసీ కాంట్రాక్ట్‌ పనులు ఇస్తారా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధన ఉందన్న విష‌యాన్ని అసలు తెలుసా అని నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఎందుకు దీని మీద మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మోదీ ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఎలాంటి చర్యలు ఉండవని విమర్శించారు. బావమరిదికి అమృత్‌ టెండర్లు.. మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్టులను రేవంత్‌ రెడ్డి పంచుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. బీఆర్ఎస్ మీదికి మాత్రమే ఈడీ, విజిలెన్స్ అంటూ వస్తారా? అని నిలదీశారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులకు సంబంధించి వాళ్లు మాట్లాడారు.. వీళ్లు మాట్లాడారు ఎందుకు అని ప్రశ్నించారు. మేఘా సంస్థ చేసిన పనికి దేశమంతా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement