Friday, April 19, 2024

టెస్లా అడుగుపెట్టదు! కేంద్రానికి ఎలాన్‌ మస్క్‌ అల్టిమేటం..

ముంబై : ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ ప్రభుత్వం ముందు తాను పెట్టిన ప్రతిపాదనలన్నింటికి సానుకూలంగా స్పందించే వరకు కార్ల ఉత్పత్తి చేయబోనని తేల్చి చెప్పారు. ఒక విధంగా ఎలాన్‌ మస్క్‌ భారత్‌ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. టెస్లా కార్ల తయారీ కేంద్రాన్ని నెలకొల్పే విషయంలో ఎలాన్‌ మస్క్‌, కేంద్ర ప్రభుత్వం మధ్య కొంత కాలంగా ప్రతిష్టంభన నెలకొంది. దీన్ని మరింత జఠిలం చేసేలా ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు చేశాడు.

ఇప్పట్లో ఆలోచనే లేదు..

భారత్‌లో టెస్లా కార్ల తయారీ యూనిట్లను నెలకొల్పాలనే ఆలోచన ఇప్పట్లో చేయట్లేదని ఎలాన్‌ మస్క్‌ తాజాగా స్పష్టం చేశారు. భారత్‌కు చెందిన కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఎలాన్‌ మస్క్‌ సమాధానం ఇచ్చారు. ఈ విషయంలో తన నిర్ణయం కూడా మారబోదన్నారు. తాను చేసిన కొన్ని ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉందని వివరించారు. దీంతో భారత్‌లో టెస్లా కార్ల విక్రయం, తయారీ యూనిట్లను నెలకొల్పే విషయంలో ఎలాన్‌ మస్క్‌ తన పట్టుదల వీడట్లేదనేది స్పష్టం అవుతున్నది. కేంద్రం ప్రభుత్వం తన ప్రతిపాదనలకు ఓకే చెప్పేంత వరకు టెస్లా కార్ల తయారీ యూనిట్లను ఎట్టిపరిస్థితుల్లో నెలకొల్పబోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టెస్లా కార్ల అమ్మకాలు, సర్వీసింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేయానికి కేంద్ర ప్రభుత్వంగా ముందుగా అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. దీనిపై తాను ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలను పంపించానని వివరించారు. భారత్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని ఆసియా దేశాల్లో తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించాలని భావించానని, పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవని ఇది వరకే ప్రకటించారు.

గత ప్రకటనలకే కట్టుబడి..

ఆ ప్రకటనలకే ఎలాన్‌ మస్‌ ్క కట్టుబడి ఉన్నాడనేది తాజాగా ప్రకటనతో మరోసారి స్పష్టమైంది. భారత్‌ ప్రభుత్వం తమ కార్ల అమ్మకాలు, సర్వీసింగ్‌ సెంటర్లను నెలకొల్పడానికి అనుమతి ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ అనుమతి లభించేంత వరకు తయారీ యూనిట్లు ఏర్పాటు చేయలేనని తేల్చి చెప్పాడు. స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో అమెరికా సహా పలు దేశాలు సేవలందిస్తున్న స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సర్వీసులు భారత్‌లో అందుబాటులోకి తీసుకుని రావడంపైనా ఎలాన్‌ మస్క్‌ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతి లభించాల్సి ఉందని స్పష్టం చేశారు. తక్కువ వ్యయంతో స్టార్‌ లింక్‌ అద్భుతమైన ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోందని, భారత్‌లో దీన్ని విస్తరించడానికి అవకాశం ప్రశ్నించగా.. కేంద్ర ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంటుందని ఎలాన్‌ మస్క్‌ బదులిచ్చాడు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement