Wednesday, April 24, 2024

కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత..

తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో నూతనంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది. అడ్లూర్ ఎల్లారెడ్డిలో ప్రజాప్రతినిధులు మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఉప సర్పంచ్ సహా ఏడుగురు వార్డు మెంబర్స్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఎనిమిది విలీన గ్రామాల ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైయ్యారని సమాచారం. బాధిత రైతులకు సంఘీభావంగా ప్రజాప్రతినిధులు ర్యాలీ చేయనున్నారు. దీంతో కామారెడ్డితో పాటు విలీన గ్రామాల్లో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అయితే, మాస్టర్ ప్లాన్ లోని ఇండస్ట్రీయల్, గ్రీన్, బఫర్ జోన్లతో పాటు వందపీట్ల రోడ్లు బాధిత గ్రామాల రైతుల భూముల్లోంచి పొందుపరిచారు. దీంతో తమ భూముల విలువలు తగ్గిపోతాయని ఆరోపిస్తూ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పంటలు పండే పంట పొలాల నుంచి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించడంపై బాధిత రైతులు వ్యతిరేకత చూపిస్తున్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి స‌ర్పంచ్ పై రైతులు మూకుమ్మ‌డిగా దాడి చేశారు. స‌ర్పంచ్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌క‌పోవ‌డంతో రైతులు దేహ‌శుద్ధి చేశారు. కామారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. రైతులను పోలీసులు అడ్డుకోవడంతో.. రైతులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement