Saturday, April 20, 2024

కెనడాలో తెలుగు సాహితీ సదస్సు

కెనడాలోని టొరంటోలో ఈనెల 25, 26 తేదీల్లో మొట్టమొదటి కెనడా తెలుగు సాహితీ సదస్సు- 12వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు ఆన్‌ లైన్‌లో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. చరిత్రలో మొదటి సారిగా ఒకే వేదిక మీద 100 మంది అమెరికా- కెనడా వక్తల సాహిత్య ప్రసంగాలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు 20 గంటల ఉచిత సాహిత్య వినోదం, విజ్ఞానం, పుస్తక ఆవిష్కరణలు, సాహిత్య చర్చా వేదికలు ఉంటాయి.  ఈ మేరకు వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా, తెలుగు తల్లి పత్రిక, ఆటవా తెలుగు అసోసియేషన్‌, అంటారియో తెలుగు ఫౌండేషన్‌, టొరంటో తెలుగు టైమ్స్‌, కాల్గరి తెలంగాణ అసోసియేషన్‌, తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ టొరంటో, తెలుగు వాహిని సాహిత్య సమూహం సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ ప్రత్యేక తెలుగు భాషా, సాహిత్య సమావేశానికి ఏర్పాట్లు త్వరితగతిన జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ ఆహ్వానాన్ని మన్నించి అమెరికా, కెనడాలో నివాసముంటున్న సుమారు 100 మంది తెలుగు సాహితీవేత్తలు ప్రసంగ ప్రతిపాదనలు పంపారని చెప్పారు. ఇది తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొంటూ ఆయా వక్తలకి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

టొరంటో ప్రధాన కేంద్రంగా ఈనెల 25, 26 తేదీల్లో జరిగే ఈ సదస్సు.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. అమెరికా, కెనడా దేశాల్లోని తెలుగు భాషాభిమానులు, సాహితీవేత్తలు ఇంత పెద్ద ఎత్తున సాహిత్యవేదికపై కలుసుకోవడం ఇదే తొలిసారి అని చెప్పారు. యూట్యూబ్‌ ద్వారా అందరూ వీక్షించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ నెల 25న https://bit.ly/3zcq0O1 లింక్‌లో, 26న https://bit.ly/3mjgLYS లింక్‌లో సదస్సును వీక్షించవచ్చన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement