Tuesday, March 26, 2024

తెలంగాణ వైసీపీకి షాక్.. గట్టు రాజీనామా!

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి.. తెలంగాణలో ఎదురు దెబ్బ తగిలింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం జగన్ గొప్పదనానికి నిదర్శనం అని అన్నారు. ఇప్పటివరకు పార్టీ ఆదేశాల మేరకు నడుచుకున్నానని తెలిపారు. ఏపీలో ప్రజలు వైసీపీని బలంగా నమ్మారని, అందుకే 151 ఎమ్మెల్యే, 23 ఎంపీ స్థానాల్లో గెలిపించారని తెలిపారు. తెలంగాణలో వైసీపీ పోరాటాలు చేయలేదన్న భావన ఇక్కడి ప్రజల్లో ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో వైసీపీ ముందుకెళ్లేలా లేదన్నారు. అందుకే ఓ జాతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానని, ఆ పార్టీ తరఫున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించారు.

వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేస్తే తాను స్వాగతిస్తానని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. షర్మిలతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు గడుస్తున్నా… నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. నిరుద్యోగులకు భరోసా ఇవ్వలేని స్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రికి తప్ప మరే నియోజకవర్గానికి నిధులు ఇవ్వలేదని ఆరోపించారు. నాగార్జున సాగర్ లో డబ్బే గెలుస్తుందన్నారు. డబ్బు కావాలో? అభివృద్ధి కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని గట్టు శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement