Saturday, April 20, 2024

కరోనా థర్డ్ వేవ్ ముప్పుతో తెలంగాణ సర్కారు అప్రమత్తం

దేశంలో కరోనా రెండో వేవ్ విజృంభణ ఇంకా ఆగలేదు. ఇంతలోనే మూడో వేవ్ రానుందని నిపుణులు నివేదికలు ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ మూడో వేవ్‌లో చిన్నారులకు ఎక్కువ ప్రమాదమని తెలిపారు. దీంతో కరోనా థర్డ్ వేవ్ ప్రజల గుండెల్లో గుబులు రేపుతుంది. తమ పిల్లలను ఎలా కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో నిపుణులు కూడా ప్రభుత్వానికి అనేక సూచనలు చేస్తున్నారు. థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటి నుండే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అందుకు అనుగుణంగా తెలంగాణ సర్కారు ఈ ముప్పును ఎదుర్కోవడంపై దృష్టిపెట్టింది.

రాష్ట్రంలో దాదాపు 30 లక్షలమంది చిన్నారులు కరోనా వైరస్‌ బారినపడే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీరిలో సుమారు 6-8 వేల మంది వరకూ ఐసీయూలో చికిత్స పొందే అవకాశం ఉండవచ్చని కూడా వారు అభిప్రాయపడుతున్నారు. ఇందులోనూ 1 శాతంమంది చిన్నారుల్లో ప్రమాదకరమైన ‘మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎస్‌-సి)’ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో సర్కారు దీనిని ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగానూ సన్నాహాలు చేపట్టింది. దీనిపై ఇటీవల వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, కొవిడ్‌ నిపుణుల కమిటీ సమావేశమై.. ముందస్తు సన్నాహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా చిన్నపిల్లలకు చికిత్స అందించేందుకు 5 వేల పడకలను సిద్దం చేస్తున్నారు. వాటిలో 10 ఐసీయూ వెంటిలేటర్ పడకలుంటాయి. అంతేకాకుండా వారికి కావలసిన అన్ని రకాల ఔషధాల కొరతను నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నారు. వైద్యుల కొరతను కూడా నిలువరించే విధంగా పోస్టులను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement