Thursday, September 21, 2023

Delhi | తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధానిలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ దినోత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు డా. మందా జగన్నాథం, కె. ఎం సాహ్నిలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.

ముందుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు భవన్ ప్రాంగణంలోని రాజ్యాంగ నిర్మాత భారతరత్న డా. అంబేద్కర్   విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత అమర వీరుల స్థూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. పోలీస్ వారి గౌరవ వందనం స్వీకరించిన  అనంతరం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి డా. మందా జగన్నాదం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -
   

ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమకారులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఢిల్లీలో నివసిస్తున్న తెలంగాణవాసులు, విద్యార్థినీవిద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని చెప్పారు. 75 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని గుర్తు చేశారు.

అందుకే ఈ సందర్భంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామని వెల్లడించారు. ఇటీవలే భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశంలో ఏ రాష్ట్రం నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నామని, దానికి కొనసాగింపుగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని మందా జగన్నాథం వివరించారు.

అనంతరం రెసిడెంట్ కమిషనర్ డా. గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ తెలంగాణ రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు చేరుకుని 76 వ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యత  దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement