Thursday, April 25, 2024

Delhi | ప్రపంచ మహిళ బాక్సింగ్‌లో సత్తా చాటిన నిఖత్ జరీన్‌.. సన్మానించిన తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో చాటిందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం జరిగిన ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ టైటిల్ మ్యాచ్‌ను ఆయన స్వయంగా వీక్షించారు. స్వర్ణ పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు సాట్స్ ఛైర్మన్ డా. ఆంజనేయులు గౌడ్, క్రీడా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… నిఖత్ తెలంగాణలోని మారుమూల ప్రాంతం నుంచి ఎదిగిందని చెప్పుకొచ్చారు. ఆమెకు ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారం అందించారని తెలిపారు. కేసీఆర్ క్రీడాకారులకు తగిన సహాయం అందిస్తున్నారని అన్నారు.

నిఖత్ రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణకు కీర్తి తెచ్చిన వాళ్లకు ప్రభుత్వం సహకారాన్ని అందిస్తామని కేసీఆర్ మొదటి నుంచి చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. నిఖత్‌ను చూసి దేశం గర్విస్తోందని అన్నారు. అందరూ నిఖత్‌ను ఆదర్శంగా తీసుకోవాలని, పిల్లలకు చదువే కాదు క్రీడలూ ముఖ్యమంత్రి మంత్రి అభిప్రాయపడ్డారు. చెడు వ్యసనాల బారిన పడుతున్న యువతకు క్రీడలను అందుబాటులోకి తీసుకురావాలని ఆయన స్పష్టం చేశారు. ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నామని, బాక్సింగ్‌కు హైదరాబాద్ హబ్‌గా మారబోతోందని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.

దేశంలో ఏ రాష్ట్రంలో క్రీడాకారులను ఆదుకోని విధంగా తెలంగాణ ఆదుకుంటోందని, త్వరలోనే క్రీడా పాలసీ ప్రకటిస్తామని తెలిపారు. తాము ప్రచారం తక్కువ చేసి పనులు ఎక్కువ చేస్తామని మంత్రి చెప్పారు. అనంతరం నిఖత్ జరీన్ మాట్లాడుతూ… రెండో సారి వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాగే తెలంగాణకు, దేశానికి పేరు తీసుకురావాలనుకుంటున్నానని చెప్పారు. తన తర్వాత టార్గెట్ ఏషియన్ గేమ్స్ అని ఆమె స్పష్టం చేశారు. ప్యారిస్ ఒలింపిక్స్ క్యాలిఫై అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపారు. వియత్నాం ప్లేయర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ అగ్రెసివ్‌గా ఆడాలని నిర్ణయించుకున్నానని నిఖత్ వెల్లడించారు.

- Advertisement -

ఏకపక్షంగా బౌట్ సాధించడం సంతోషంగా ఉందని, భారత దేశానికి మెడల్ సాధించడం గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. కష్టపడితే దేవుడు అన్నీ ఇస్తాడని నిఖత్ అన్నారు. తనకు అన్నివేళలా సహకరిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement