Thursday, March 28, 2024

సంక్షేమ పథకాల అమలులో దేశానికే తలమానికం తెలంగాణ : కొప్పుల ఈశ్వర్‌

ధర్మారం : సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికి తలమానికంగా మారిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం ధర్మారం మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల వ్యాప్తంగా నూతనంగా మంజూరైన 1783 మందికి పెన్షన్‌ కార్డులను మంత్రి కొప్పుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఆసరా పథకం ద్వారా లక్షలాదిగా పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెద్ద కొడుకులా ఆదుకునేందుకు ముందుకు వచ్చాడన్నారు. పేదలంతా గౌరవంగా బతకాలనే ఉద్దేశంతో భద్రతతో జీవించే ఆసరా పింఛన్లను అందిస్తున్నాడన్నారు.

57 ఏళ్ల వారికి కూడా పెన్షన్‌ సౌకర్యం కల్పించడం ద్వారా మరో 10లక్షల మందికి రాష్ట్రంలో ఆసరా పెన్షన్‌ అందుతుందన్నారు. దేశవ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పెన్షన్లు ఇస్తుంటే, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆసరా లబ్ధిదారుడికి ఆసరా గుర్తింపు కార్డు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న బీజేపీ తమ పాలిత రాష్ట్రంలో ఇలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ఉచితాలని విమర్శలు చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రిని ప్రపజలు ఆదరించి ప్రతిపక్ష పార్టీలు కుట్రలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ధర్మారం జడ్పిటిసి పద్మజ, ఎంపీపీ కరుణశ్రీ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ- చైర్మన్‌ బుచ్చిరెడ్డి, పీఎసిఎస్‌ చైర్మన్లు, బలరాం రెడ్డి, బంధం రవి, వెంకట్‌ రెడ్డి, గ్రామాల సర్పంచ్‌లు, తహశీల్దార్‌, ఎంపిడిఓ, లబ్దిదారులు, ప్రజలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement