Friday, March 29, 2024

ఏపీ అంబులెన్సుల‌ను ఆపడం పై హైకోర్టు సీరియస్..

ఏపీ నుంచి అత్య‌వ‌స‌ర చికిత్స కోసం హైద‌రాబాద్ వ‌స్తున్న క‌రోనా బాధితుల‌ను అడ్డుకోవ‌టంపై తెలంగాణ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఏపీ నుండి క‌రోనా బాధితులు మెరుగైన వైద్యం కోసం హైద‌రాబాద్ వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తుండ‌గా… స‌రిహ‌ద్దుల వ‌ద్ద తెలంగాణ పోలీసులు అడ్డుకుంటున్నారు. సోమ‌వారం ఉద‌యం నుండి ఈ ఆంక్ష‌లు ప్రారంభం కాగా… సాయంత్రానికి పోలీసులు కొంద‌ర్ని అనుమ‌తించారు. కానీ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఆంక్ష‌లు మ‌ళ్లీ అమ‌లు చేస్తున్నారు. దీనిపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ అధికారంతో అంబులెన్స్‌లను ఆపారు? విపత్తు వేళ అంబులెన్స్‌లు నిలిపివేయడం మానవత్వమేనా? బార్డ‌ర్ల వ‌ద్ద అంబులెన్సులు నిలిచిపోతున్నాయ‌ని… వారికి ఏమైనా అయితే బాధ్య‌త ఎవ‌రిది అని ప్ర‌శ్నించింది. ఏపీ స‌హా ఇత‌ర రాష్ట్రాల నుండి వ‌స్తున్న ప్ర‌యాణికుల‌కు క‌రోనా టెస్టు మాత్ర‌మే చేయాల‌ని కోర్టు చెప్పింద‌ని, అంబులెన్సులు ఆపాల‌ని మీకు ఎవ‌రు ఆదేశించార‌ని ప్ర‌భుత్వాన్ని కోర్టు ప్ర‌శ్నించింది.

ఇటు రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తిపై కూడా హైకోర్టులో విచార‌ణ జరిపింది. రాత్రి కర్ఫ్యూ అమలు సరిగా లేదని..మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించట్లేదు?రంజాన్‌ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా? కోర్టు ఆదేశాలు, సూచనలు బుట్టదాఖలు చేయడం బాధాకరం’’అని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్, హైద‌రాబాద్ సీపీ విచార‌ణ‌కు హ‌జ‌ర‌య్యారు. లాక్ డౌన్, క‌ర్ఫ్యూ పొడిగింపుపై హైకోర్టు ప్ర‌శ్నించగా… మ‌ధ్యాహ్నాం 2గంట‌ల‌కు మంత్రివ‌ర్గ స‌మావేశం ఉంద‌ని, అందులో నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఏజీ కోర్టుకు వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement