Tuesday, March 26, 2024

Green Telangana | అట‌వీ విస్తీర్ణంలో తెలంగాణ‌కు రెండోస్థానం.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల‌లో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో అటవీ విస్తీర్ణంలో మన రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. ఈ విష‌యాన్ని కేంద్రం పర్యావ‌ర‌ణ‌, అట‌వీ శాఖ మంత్రి అశ్విని కుమార్ చౌబే అధికారికంగా గురువారం రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. రాష్ట్ర ప్రభుత్వం 2015-16లో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం కింద 230 కోట్ల మొక్కలు నాటాలని ల‌క్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రి నాటికి 235.59 కోట్ల మొక్కలు నాట‌డం జ‌రిగింది. దీంతో 102.6 శాతం మొక్క‌లు నాట‌డం జ‌రిగింది.

ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ISFR) 2021 ప్ర‌కారం.. తెలంగాణ‌లో 21,214 చదరపు కిలోమీటర్ల అటవీ విస్తీర్ణం ఉంది. 2019 – 2021 మ‌ధ్య అట‌వీ విస్తీర్ణాన్ని ప‌రిశీలిస్తే.. 632 చదరపు కిలోమీటర్ల పెరుగుదల ఉంది. దీంతో దేశంలోనే తెలంగాణ అట‌వీ విస్తీర్ణంలో రెండో రాష్ట్రంగా నిలిచింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం 647 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల పెరుగుద‌ల‌తో మొద‌టి స్థానంలో నిలిచింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అట‌వీ విస్తీర్ణాన్ని ప‌రిశీలిస్తే.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో 12 చ‌. కి.మీ. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 11, మ‌హారాష్ట్రలో 20, గుజ‌రాత్‌లో 69, క‌ర్ణాట‌క‌లో 155 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల పెరుగుద‌ల ఉంది. అయితే అట‌వీ విస్తీర్ణం పెరుగుద‌ల‌కు కేంద్రం తీసుకుంటున్న చ‌ర్య‌లను వివ‌రించాల‌ని బీఆర్ఎస్ ఎంపీ బీ పార్థ‌సార‌థి రెడ్డి అడిగిన ప్ర‌శ్న‌కు అశ్విని కుమార్ చౌబే స‌మాధానం ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement