Friday, April 26, 2024

Vemulawada: రాజన్నపై సీఎం కేసీఆర్‌కు అమితప్రేమ

నిత్యం భక్తులతో కిటకిటలాడే రాజన్న సన్నిధిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ రాజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రంగా మలచడానికి పూనుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 37 ఎకరాల సేకరణ జరిగింది. యాదాద్రి పునర్నిర్మాణం పూర్తికావడంతో ఇక వేములవాడ ఆలయంతోపాటు, దాని పక్కనే ఉన్న కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికీ ప్రణాళికారచన జరుగుతున్నది. సీఎం కేసీఆర్‌ వల్లనే తెలంగాణ ప్రాంతం ఆధ్యాత్మిక స్వర్గధామంగా వెలుగులీనుతున్నదని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

దక్షిణకాశీగా పేరు గాంచిన ఎములాడ రాజన్న అంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమితమైన ప్రేమ. ఈ క్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని గతంలోనే సంకల్పించారు. అత్యంత ప్రీతిపాత్రుడైన రాజరాజేశ్వర స్వామిని ముఖ్యమంత్రి హోదాలో ఇప్పటికే మూడుసార్లు దర్శించుకొన్నారు. రాజన్నను దర్శించుకొన్నవారికెల్లా పదవీగండం తప్పదనే అపవాదును ముఖ్యమంత్రి పోగొట్టారు. మూడుసార్లు కూడా కుటుంబ సమేతంగా సందర్శించి, కోడెను కట్టేసి, స్వామివారికి ప్రత్యేక మొక్కులు కూడా చెల్లించుకొన్నారు. మొదటిసారి 2015 జూన్‌ 18న, రెండోసారి డిసెంబర్‌ 28న, మూడోసారి 2019 డిసెంబర్‌ 30న వచ్చారు. మొదటిసారిగా వచ్చినప్పుడు 7 గంటలపాటు వేములవాడలో గడిపారు. గుడి చెరువు, ఆలయ పరిసరాలు, పట్టణ పరిసరాల్లో ఆయన క్షేత్రస్థాయిలో తిరిగారు. గుడిచెరువు శిఖం భూములను తీసుకొని 37 ఎకరాలకు ఆలయాన్ని విస్తరించాలని అధికారులను ఆదేశించి భూసేకరణ పూర్తిచేశారు. ఎర్రవెల్లిలో అయుత చండీయాగం అనంతరం రాజరాజేశ్వరస్వామిని అదే ఏడాది డిసెంబర్‌ 28న రెండోసారి దర్శించుకొన్నారు. మూడోసారి 2019 డిసెంబర్‌ 30న వేములవాడకు వచ్చారు. ఆలయ విస్తరణ కోసం సేకరించిన గుడిచెరువులో భూమిని పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

స్వామివారి ప్రధాన అంతర్గత ఆలయ విస్తీర్ణం గతంలో 16 గుంటల్లోనే ఉన్నది. దీన్ని 40 గుంటలకు పెంచేలా నివేదికలు తయారు చేయడంతోపాటు 20 కోట్లతో రెండో ప్రాకారం నిర్మాణాలను చేపట్టేందుకు అంచనాలను రూపొందించారు. అందులో తూర్పున కళాభవనం వద్ద రెండో రాజగోపురం నిర్మాణం, ఉత్తరం వైపున కల్యాణకట్ట, ప్రసాదాల కౌంటర్‌లు, ఓపెన్‌స్లాబ్‌తో పడమటి ద్వారం వరకు ఆలయంలోని అంతర్భాగాన్ని పెంచనున్నారు. అలాగే గుడిచెరువు ఈశాన్య భాగాన్ని విస్తరించేందకు 90.36 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

స్వామివారి సన్నిధిలో శ్రీసీతారామస్వామి, శివకల్యాణాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ కల్యాణాలకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తుంటారు. ఇప్పటివరకు కల్యాణ వేదికలు లేకపోగా సీతారాముల వారి కల్యాణం చైర్మన్‌ హాల్‌ ఎదుట నిర్వహిస్తుండగా, స్థలం సరిపోక భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో సీతారాముల, స్వామివారి కల్యాణాలను భక్తులందరూ వీక్షించేలా చెరువులో ఈ వేదికలు నిర్మించడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

సీఎం కేసీఆర్‌ 2015 లో సందర్శించిన అనంతరం వేములవాడ పట్టణం, రాజన్న ఆలయాన్ని సమగ్రాభివృద్ధి చేసేలా వేములవాడ ఆలయ ఏరియా అభివృద్ధి ప్రాధికార సంస్థ (వీటీడీఏ)ను ఏర్పాటు చేశారు. చైర్మన్‌గా సీఎం కేసీఆర్‌, వైస్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ముద్దసాని పురుషోత్తంరెడ్డిని నియమించారు. వీటీడీఏ ద్వారా భూసేకరణ, రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను రూపొందించారు. రాజన్న ఆలయ అభివృద్ధితోపాటు విస్తరణ పనులు చేపట్టేందుకు దేవాదాయశాఖ కమిషనర్‌, వీటీడీఏ బృందం ఇప్పటికే శృంగేరి పీఠాధిపతి వద్దకు వెళ్లి అభివృద్ధి నమునాలను కూడా వారి ముందు ఉంచగా, ఆమోదం కూడా తెలిపారు.

- Advertisement -

ఆలయాన్ని విస్తరించడంతోపాటు గుడిచెరువు ప్రాంతాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు 65 ఎకరాలు సేకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా 30 కోట్లు వెచ్చించి ఇప్పటికే 37 ఎకరాల భూమిని సేకరించారు. బండ్‌ చుట్టూ రింగ్‌రోడ్డు వేసేందుకు 22 కోట్లతో మరో 28.29 ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు మంజూరుచేసింది. భక్తులపై భారం పడకుండా బస్టాండ్‌ను కూడా రాజన్న ఆలయం వద్దకే మార్చాలని నిర్ణయించిన అధికారులు, ఇందుకు జగిత్యాల బస్టాండ్‌ సమీపంలో 22 ఎకరాల స్థలం సేకరించాలని నిర్ణయించారు.

రాజరాజేశ్వరస్వామి ఆలయానికి సంస్కృత కళాశాల ఉండగా విద్యార్థులకు బోధనను కూడా అందిస్తున్నారు. వేములవాడలో సీఎం కేసీఆర్‌ సందర్శన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వేద పాఠశాలను మంజూరు చేసింది. భీమేశ్వరాలయం ఎదుట ఉన్న భవనంలో వేదపాఠశాల ప్రారంభం కాగా, ప్రస్తుతం 25 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ వేములవాడను సందర్శించి వెళ్లిన తర్వాత అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయి. పట్టణంలో రెండు బైపాస్‌ రహదారుల విస్తరణ, సెంట్రల్‌ లైటింగ్‌ లాంటివి పూర్తయ్యాయి. వేములవాడకు వచ్చే రహదారులను నాలుగు వరుసలుగా అభివృద్ధి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement