Thursday, March 28, 2024

సుప్రీంలో తెలంగాణ గవర్నర్ వ్యవహారం.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసిన పంపిన 10 కీలక బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదముద్ర వేయకుండా తన వద్దే తొక్కిపెట్టారని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. నిర్ణీత కాలవ్యవధిలోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్‌తో ముడిపడ్డ ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటని ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించింది.

ఈ మేరకు కేసులో ప్రతివాదుల్లో ఒకటిగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. అయితే నోటీసులు అవసరం లేదని, ఏం జరుగుతుందో తెలుసుకుంటానని తుషార్ మెహతా ధర్మాసనానికి చెప్పారు. శాసనసభ ఆమోదించిన బిల్లులు ఈ మధ్యనే రాజ్‌భవన్‌కు వచ్చాయని ఆయన వెల్లడించారు. బిల్లుల ఆమోదంపై పురోగతి గురించి తెలుసుకుని చెబుతానన్నారు. గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగబద్ధమైనదని, ఈ నేపథ్యంలో నోటీసులు జారీ చేయవద్దని కోరారు. అయితే సుప్రంకోర్టు ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ వైఖరి కోరుతూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 27కు వాయిదా వేసింది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement