Thursday, November 30, 2023

Big Story | పరిశ్రమలకు పండగ.. అండగా సర్కార్‌ కార్యాచరణ

ఆంధ్రప్రభ, హైదరాబాద్‌ : రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాలు అమలు చేయనుంది. టీఎస్‌బీపాస్‌, టీఎస్‌ఐపాస్‌లను మరింత బలోపేతం చేయనున్నది. కలెక్టర్లకు ఈ మేరకు ఎటువంటి జాప్యం లేకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఆన్‌లైన్‌ ప్రక్రియలో ప్రోత్సహకాలను పొందేలా తాజాగా అనేక మార్పులను ప్రతిపాదించింది. రాష్ట్రంలో సూక్ష్మ, లఘు, మధ్యతరహా ఖాయిలా పడిన పరిశ్రమలను పునరుద్దరించేందుకు దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక హెల్త్‌ క్లినిక్‌ విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రాయితీలు పెంచి సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. చిన్న తరహా పరిశ్రమల చేయూతకు ఎన్‌బీఎఫ్‌ఐను ఏర్పాటు చేసి రూ. 100కోట్ల మూలనిధితో సీఈవోను నియమించేందుకు పరిశ్రమల శాఖ కృషి చేస్తోంది. ఈ నిధిలో రూ. 50కోట్లు కేంద్రం, రూ. 50 కోట్లు రాష్ట్రం వాటాగా భరించనున్నాయి. ఈ నిధితో ఎప్‌బీఎఫ్‌ఐ స్వయం ప్రతిపత్తితో నడిపేలా ప్రత్యేక శ్రద్దను టీ సర్కార్‌ చేపట్టింది. ఈ నిధినుంచి చిన్న తరహా పరిశ్రమలకు రూ. 50వేలు నేరుగా గ్రాంట్‌గా ఇవ్వడంతోపాటు రూ. 5లక్షల వరకు 3 శాతం వడ్డీతో రుణాలు అందించనున్నారు.

- Advertisement -
   

టీఎస్‌ఐపాస్‌తో అద్భుత విజయం…

రాష్ట్రం వినూత్నంగా అమలులోకి తెచ్చిన టీఎస్‌ఐపాస్‌ విధానంతో రూ. 49463కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తద్వారా 2929 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంతో ప్రత్యక్షంగా 195390 మందికి, పరోక్షంగా మరో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి. వీటిలో 1138 యూనిట్లు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రాంభించగా మరో 405 యూనిట్లు నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నాయి. అతి త్వరలో 1543 యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేయనున్నాయని సమాచారం.

అవసరమైన భూములు సిద్దం…

పారిశ్రామిక అవసరాలకు అనువుగా భూములను సేకరించడంతో తెలంగాణ ప్రభుత్వం సఫలమవుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు అగ్రతాంబులం వేస్తున్న ప్రభుత్వం అందుకు అనువైన మౌలిక వసతులకు కూడా ముందస్తు ఏర్పాట్లనే చేస్తోంది. టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 1,45,682.99 ఎకరాల విస్తీర్ణంలోని భూములను పారిశ్రామిక ప్రయోజనకారిగా గుర్తిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుంది. వీటిని భూమి బ్యాంక్‌కు చేర్చి భవిష్యత్‌ అవసరాలకు వినియోగించాలని యోచిస్తోంది.

విస్తరణకు 256 పరిశ్రమలు రెడీ…

పాత, చిన్న పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహం పెరగడంతో పెట్టుబడీదారులు భారీగా ముందుకు వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 256 చిన్న పరిశ్రమలు విస్తరణకు అనుమతించాలంటూ సర్కార్‌కు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందుకు అవసరమైన భూములను కూడా ఇచ్చేందుకు ఇప్పటికే ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చింది. ఇప్పటివరకు పెద్ద పరిశ్రమలకే ఇస్తున్న భూములు, రాయితీలు ఇక చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు కూడా అందించేందుకు మార్గం సుగమమైంది. ఇందులో ఇంజనీరింగ్‌, ప్లాస్టిక్‌, విద్యుత్‌ పరికరాలు, సౌర పరికరాలు, ఫ్యాబ్రికేషన్‌, టెక్స్‌టైల్స్‌ వంటి పరిశ్రమలు విస్తరణ దిశగా ముందుకొచ్చాయి. ఇందుకు ఔటర్‌ రింగ్‌రోడ్డు వెలుపల 450 ఎకరాలను కేటాయించాలని నిర్ణయించారు. రూ. 100 కోట్లతో 1లక్ష మందికి ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమల శాఖ కార్యాచరణ చేపట్టింది. కేటాయించిన భూములకు నిర్ధేశిత గడువును కూడా నిర్ణయించాలని యోచిస్తోంది. తద్వారా భూములు దుర్వినియోగం కాకుండా కీలక చర్యలు తీసుకుంటోంది.

స్పెషల్‌ ఛేజింగ్‌సెల్‌తో సత్ఫలితాలు…

ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న స్పెషల్‌ ఛేజింగ్‌ సెల్‌తో సత్ఫలితాలు వస్తున్నాయి. టీఎస్‌ఐపాస్‌ విధానంలో భాగంగా రూ. 5కోట్లలోపు పెట్టుబడి పెట్టే పరిశ్రమలకు జిల్లా స్థాయిలో అనుమతులు ఇస్త్తుండగా, రూ. 5కోట్లకు మించిన పెట్టుబడి ఉన్న పరిశ్రమలకు పరిశ్రమల శాఖ కమిషనరేట్‌నుంచి అనమతులు జారీ చేస్త్తున్న సంగతి తెలిసిందే. ఈ సెల్‌ అన్ని రకాల పారిశ్రామికవేత్తలకు సమాచారం, సలహాలు, అనుమతులకు తనవంతుగా కృషి చేస్తోంది.

కొత్తగా 5 పారిశ్రామిక సమూహాలు…

ఒకవైపు పారిశ్రామిక రంగానికి రాష్ట్రం పెద్దపీట వేస్తొండగా కేంద్రం కూడా భారీగా సాయం చేస్తోంది. ఇటీవలే రాష్ట్రానికి 5 పారిశ్రామిక క్లష్టర్‌లను కేంద్రం మంజూరీ చేసింది. జాతీయ సూక్ష్మ, చిన్న పరిశ్రమల సమూహ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కరీంనగర్‌, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు క్లష్టర్‌లను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. స్థానికంగా ఉండే వనరుల ఆధారంగా ఇవి ఉత్పదకత, పోటీ తత్వంపెంచి చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది. ఈ పథకంలో భాగంగా ఆయా ప్రతిపాదిత జిల్లాల్లో 150 పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కరీంనగర్‌ జిల్లా బావుపేటలో గ్రానైట్‌ క్లస్టర్‌, ఖమ్మంలో గ్రానైట్‌ శుద్ది క్లష్టర్‌, మిర్యాలగూడలో రైస్‌ మిల్లుల క్లస్టర్‌, నిజామాబాద్‌లో రైస్‌ మిల్లులు, ఆదిలాబాద్‌లో పత్తి, జిన్నింగ్‌ మిల్లుల క్లష్టర్ల ఏర్పాటుకు సర్కార్‌ ప్రాధాన్యతనిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement