Saturday, April 20, 2024

Big story : జాతీయ స్థాయిలో ఆర్ధిక పరపతి భేష్‌… తెలంగాణకు ఆర్ధిక సంస్థల కితాబు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆర్ధిక ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ నేర్పుగా నెట్టుకొస్తున్నది. సకాలంలో బిల్లులు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలకు నిధులు, వేతనాలు, పింఛన్ల వంటి భారీ మొత్తాలకు నిధులను సర్దుబాటు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వానికి రుణాలపై వడ్డీలను సకాలంలో చెల్లిస్తోందనే పేరు జాతీయ స్థాయిలో మెండుగా ఉన్నది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పూచీకత్తు రుణాలు, ఇతర అప్పులకు వడ్డీలను సకాలంలో చెల్లిస్తూ ఇందుకు నెలకు రూ.1683కోట్లను చెల్లిస్తున్నది. ఇదే సమయంలో గతేడాది నెలకు రూ.1466 కోట్లను సఘటుగా చెల్లింపులు వడ్డీలకు చేసింది. ఈ ఆర్ధిక యేడాదిలో ఇప్పటివరకు ఏప్రిల్‌ నెలలో రూ.1631కోట్లు, యే నెలలో రూ.1530కోట్లు, జూన్‌లో రూ.1768కోట్లు, జూలైలో రూ.1581కోట్లు, ఆగష్కటులో రూ.1446కోట్లు, సెప్టెంబర్‌లో రూ.2142కోట్లు చెల్లించింది. దీంతో అప్పుల పరిమితి పెరిగింది.

కేంద్ర పాపం ఫలితమే…

కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల కారణంగా రాష్ట్రాల వృద్ధిరేటు కుంటుపడుతోంది. అయినప్పటికీ ఎటువంటి ప్రతికూలతలనైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆర్‌ధిక క్రమశిక్షణతో ముర్దుకు వెళుతున్న తెలంగాణ తాజా ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర రాబడిలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి సీఎస్‌ఎస్‌, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్‌ 12.9 శాతం తగ్గినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఈ వృద్ధి రేటును నమోదు చేయడం ఆర్ధిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తోంది. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకపోవడం, అప్పుల పరిమితుల్లో కోతలు విధించడం వంటి వాటితోపాటు, కొత్త కొత్త చట్టాలతో షరతులు విధించి వాటిని అమలు చేస్తేనే అప్పుల పరిమితిని పెంచుతామని బహిరంగ బెదిరింపులకు కేంద్రం దిగుతోంది.

ఇలా ఈ ఏడాదిలో ఎఫ్‌ఆర్‌బీఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్ర ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని ఆర్ధిక వర్గాలు భావిస్తున్నాయి. గొప్పలు చెప్పుకుంటున్న మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంనుంచి కేంద్ర ప్రాయోజిత పథకాల రూపంలో గత 8 సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ. 47,312 కోట్లు నిధులు మాత్రమే తెలంగాణకు అందినట్లు లెక్కలు ధృవీకరిస్తున్నాయి. ఇదే సమయంలో తెలంగాణ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలిస్తే అనేక అంశాలు వెల్లడవుతున్నాయి. ఇది కేంద్రానికి మింగుడు సపడటంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్‌ గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రాష్ట్ర రైతాంగానికి రూ. 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించినట్లు ఆర్థికశాఖ నివేదికద్వారా వెల్లడైంది.

నానాటికీ తగ్గుతున్న కేంద్ర వితరణ…

- Advertisement -

గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష 84 కోట్ల నిధులను వివిధ క్యాపిటల్‌, ఇతర ఎక్స్‌పెండిచర్‌ చేయగా, సీఎస్‌ఎస్‌ పథకాల కింద కేంద్రంనుంచి అందింది రూ.5200 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్ర ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి రూ.1 లక్షా 84వేల కోట్లకు పెరిగి ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్ల వృద్ధిని సాధించి, దేశంలో అగ్రగామిగా నిలిచి ఆర్ధిక పురోగతిలో దూసుకుపోతున్నది.

కొత్త లబ్దిదారులతో మరింత భారం…

రైతు రుణమాఫీ, రైతుబంధులలో కొత్త లబ్దిదారులతో పాటు కొత్తగా సామాజిక పించన్ల పెంపుతో ఖజానాపై మరింత భారం పడనుంది. ఇప్పటివరకు లోటు ప్రభావం పడకుండా నెట్టుకొచ్చిన ప్రభుత్వానికి తాజా విపత్కర పరిస్థితిని ధీటుగా ఎదుర్కొనేందుకు నిధుల సమీకరణ, అత్యవసర వ్యయాలు, వడ్డీలు, రుణాల రీపేమెంట్‌ వంటివి అతిపెద్ద సవాలుగా మారాయి.
ఈ క్రమంలో ఇప్పటికే కార్పొరేషన్ల పేరుతో చేసిన గ్యారంటీ అప్పులను నిలిపివేయగా తుది దశలో ఉన్న ప్రాజెక్టులు, ఇతర అవసరాలకు నిధుల సమన్వయం రాష్ట్ర ప్రభుత్వానికి కత్తీమద సాముగా మారింది. ఇంతటి విషమ సమయంలో ప్రజలపై భారం మోపకుండా, కొత్త పన్నులు వేయకుండా సంపద పెంచి సరికొత్త రీతిలో ఆర్ధిక సర్దుబాటు దిశగా కార్యాచరణ చేస్తోంది. కేంద్రం వద్ద ఉన్న పెండింగ్‌ జీఎస్టీ బకాయిలు, జీఎస్టీ రిజిస్ట్రేషన్ల పేరుతో ఏపీకి తరలిన నిధులు, ఇతర ఆదాయాలపై త్వరలో జాతీయ స్థాయిలో వినిపించేలా కార్యాచరణ రూపొందించుకుంటోంది.

ముందు చూపుతో…

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన అనేక కార్యక్రమాలు, చర్యలతో గడచిన ఐదారేళ్లుగా ఆర్ధిక సుస్థితరను కొనసాగించుకుంటూ ముందుకు సాగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా వ్యయాలు, వేతనాలతో సతమతమవుతూనే అంతే గొప్పగా ఆర్ధిక స్థిరత్వానికి ముందుచూపుతో కీలక చర్యలు తీసుకుంటున్నది. గతేడాదికంటే రూ. 1500కోట్లు అదనంగా ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లపైనే భారం పెరిగినప్పటికీ పీఆర్సీ ప్రకటన వంటి అంశాల్లో జాప్యం చేయలేదు. అంతేస్థాయిలో ఇతర వ్యయాలు కూడా భారీగా పెరగ్గా, రాబడిని అంతకంతకూ పెంచుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. రానున్న చివరి 5 మాసాలలో ఆర్ధికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసే చర్యలపై సర్కార్‌ దృష్టిసారించిందని చెబుతున్నారు.

భారీ అంచనాలు…

2022-23 ఆర్ధిక యేడాదిలో రూ. 1.33 లక్షల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో పొందేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు అన్ని సొంత వనరుల రాబడి శాఖలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. జీఎస్టీ, అమ్మకం పన్ను, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌, ఇతర ఆదాయాలపై సర్కార్‌ ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలో ఆయా శాఖల రాబడిపై ఈ ఆర్ధిక యేడాదిలో నెలవారీ సమీక్షలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అంచనాల చేరికలో ఇబ్బందులు పడుతున్న సొంత వనరుల రాబడి శాఖల్లో పురోగతిని పరిశీలించి ఎప్పటికప్పుడు వేగవంతంగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక మరో కీలక వనరుగా ఉన్న పన్నేతర రాబడులను కూడా ఈ ఏడాది రూ. 7వేల కోట్లనుంచి రూ. 25442కోట్లకు పెంచుకున్నారు. ఇందులో భూముల అమ్మకం ద్వారా రూ. 15500కోట్లను ప్రతిపాదించారు. కేంద్ర పన్నుల వాటా, ఇతర సాయాల్లో రూ. 59,396కోట్లను అంచనా వేసుకోగా ఈ సాయం అందే పరిస్థితి ఆశాజనకంగా లేదని సమాచారం.

కోతలతో కష్టాలు…

తెలంగాణ రాష్ట్ర రుణ పరిమితిలో రూ. 15వేల కోట్లమేర కోతలకు సర్వం సిద్దమైంది. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 30వేల కోట్ల రుణాలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ మరో రూ. 30వేల కోట్లు కోత పడటంద్వారా మొత్తంగా రూ.45వేల కోట్లు కోతలు పడే ప్రమాదం ఉందని తెలుస్తోంది ప్రస్తుత ఆర్ధిక యేడాదిలో బాండ్ల విక్రయంద్వారా రూ. 53,970 కోట్ల స్టేట్‌ డెవలప్‌మెంట్‌ లోన్లకు కేంద్ర ఆర్ధిక శాఖ తొలుత ఆమోదించింది. ఆ తర్వాత ఇటీవలే కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు, షరతులతో ఇది రూ. 23వేల కోట్లకే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బడ్జెట్‌ వెలుపలి రుణాలపై ఆర్ధిక శాఖ మార్చి 31న రాష్ట్రాలకు రాసిన లేఖలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో కాకుండా అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు రాష్ట్రం తీసుకున్న రుణాలు పెరిగాయని ఆక్షేపించింది. అంతే మొత్తంలో ఈ ఏడాది రుణంలో కోతలు పెడ్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement