Monday, April 15, 2024

ఈనెల 22న కాంగ్రెస్ మహాధర్నా, 27న భారత్ బంద్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఈనెల 22న మహాధర్నా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రకటించారు. ఈ మేరకు గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడి పోరాటాలు నిర్వహించి మెడలు వంచి ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. 19 రాజకీయ పక్షాలు సోనియా గాంధీ నేతృత్వంలో తీసుకున్న పోరాటాల ప్రణాళిక ప్రకారం బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరుపై పోరాటం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

ప్రభుత్వాల వ్యతిరేక విధానాలపై ఈనెల 22న మహాధర్నా, 27న భారత్ బంద్, 30న జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయనున్నట్లు మల్లు రవి వెల్లడించారు. అక్టోబర్ 5న పోడుభూముల సమస్యలపై ఆదిలాబాద్ నుంచి ఆశ్వారావుపేట వరకు రాస్తోరోకో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దళితులకు మూడెకరాలు ఇస్తామని మాట తప్పిందని, పోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోడు భూముల సమస్యలపై పోరాడాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement