Monday, September 25, 2023

పర్యావరణంలో నెంబర్‌ 1గా తెలంగాణ.. సీఎస్‌ఈ నివేదిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దశాబ్ధి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుందని వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంస్థ సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. 7,213 పాయింట్లతో తెలంగాణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అడవుల పెంపకం, మునిసిపల్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌ వంటి అనేక పర్యావరణహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ, రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. జాతీయ స్థాయిలో తెలంగాణకు గొప్ప గుర్తింపు లభించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ పచ్చదనంతో విరాజిల్లుతుందని, అందుకు కారణం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన హరిత హారంతో పాటు అనేక కార్యక్రమాలు అన్నారు. హరితహారాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు.

- Advertisement -
   

273 కోట్ల మొక్కలు.. 33 శాతానికి విస్తీర్ణం

రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందన్నారు. ప్రపంచంలోనే రెండోవ అతిపెద్ద మానవ ప్రయత్నంగా ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. దాదాపు 273 కోట్ల మొక్కలను గత తొమ్మిదేళ్ల కాలంలో నాటామన్నారు. 2015-16 ఏడాదిలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా 2023 నాటికి అది 26,969 చదరపు కిలో మీటర్లకు పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా 24.06 శాతం అడవులను కలిగి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు. హరితహారంతో 7.7 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదక పేర్కొన్న విషయాన్ని కేటీఆర్‌ గుర్తు చేశారు.

గ్రామాల నుంచే మొదలు

హరిత బడ్జెట్‌ను తీసుకు వచ్చిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. ప్రతి గ్రామంలో నర్సరీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 నర్సరీలు, 19,400 పైగా పల్లె ప్రకృతి వనాలు, 2725 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను నెలకొల్పామని చెప్పారు. పట్టణాల్లో 700 కోట్ల రూపాయలతో 180 అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమం ఫలించిందనడానికి హైదరాబాద్‌ నగరానికి వరల్డ్‌ ట్రీ సిటీగా రెండుసార్లు గుర్తింపు లభించడమే నిదర్శనమన్నారు. హైదరాబాద్‌ నగరంలో వేస్ట్‌ టూ ఎనర్జీ రంగంలో 24 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement