Thursday, March 28, 2024

ఆస్ట్రేలియాతో టీమిండియా సమరం.. నేడు విశాఖ వేదికగా రెండవ వన్డే

ఆసీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను సొంతం చేసుకునేందుకు టీమిండియా సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్‌, నేడు వైజాగ్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లోనూ విజయం సాధించి తీరాలని పట్టుదలతో ఉంది. తద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మొదటి వన్డేకు వ్యక్తిగత కారణాలతో దూరమైన సారథి రోహిత్‌శర్మ విశాఖ మ్యాచ్‌లో పాల్గొనబోతున్నాడు. రోహిత్‌ రాక ఎవరిపై ప్రభావం చూపుతుందన్నది ఆసక్తిగా ఉంది. తొలి వన్డేలో నాటకీయంగా టాపార్డర్‌ విఫలమైన క్రమంలో, కేల్‌ రాహుల్‌ (75నాటౌట్‌), జడేజా (45నాటౌట్‌) టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌కు వెన్నెముఖగా నిలిచి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. దీంతో వైఫల్యాల విమర్శల నుంచి కేఎల్‌ రాహుల్‌ బయటపడినట్లే.

ఇక ముంబైలో విఫలమైన ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లలో ఒకరిపై వేటు తప్పదనే వాదన వినిపిస్తోంది. సీనియర్‌, మిస్టర్‌ 360 స్పెషలిస్టు బ్యాటర్‌ అయిన సూర్యకుమార్‌ వైపు యాజమాన్యం మొగ్గు చూపొచ్చని, ఫలితంగా ఇషాన్‌ కిషన్‌ను పక్కనబెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. ఇక బౌలింగ్‌ విభాగంలో పెద్దగా ప్రయోగాలు చేయకపోవచ్చు. అదనంగా మరొక బ్యాటర్‌ లేదా స్పిన్నర్‌ను తీసుకోవాలని ఆఖరి నిముషంలో భావిస్తే, కుల్‌దీప్‌ స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ సరైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాడు.

- Advertisement -

ఒకవేళ ఏదైనా కారణాలతో రోహిత్‌ గనుక జట్టుతో చేరని పక్షంలో, మొదటి వన్డే ఆడిన బృందంతోనే హార్దిక్‌ సారథ్య బాధ్యతలు కొనసాగించొచ్చు. అప్పుడు ఇషాన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లిద్దరికీ అవకాశం దక్కుతుంది. తమ సామర్థాన్ని నిరూపించుకుని, వన్డే ప్రపంచకప్‌కు సిద్ధమయ్యేందుకు వీరికి ప్రతీ మ్యాచ్‌ అగ్నిపరీక్ష కానుంది. వీలైనంత త్వరగా ఫామ్‌ను దొరకబుచ్చుకుని విధ్వంసకర బ్యాట్స్‌మన్‌లుగా నిలబడటం అనివార్యం. మరోవైపు సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఆస్ట్రేలియాది.

Advertisement

తాజా వార్తలు

Advertisement