Wednesday, April 24, 2024

వాహన దారులపై పన్ను బాదుడు.. లైఫ్‌టాక్స్‌తో పాటు అన్ని రకాల పన్నులను పెంచుతూ ఉత్తర్వులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బైక్‌ మొదలు బస్సు వరకు అన్ని రకాల వాహనాల లైఫ్‌టాక్స్‌ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులను జారీ చేసింది. 7 వ తేదీతో జారీ చేసిన ఈ ఉత్తర్వులు 9 వ తేదీ నుంచి పెంచిన పన్ను వర్తిస్తుందని పేర్కొంది. ఉత్తర్వులలో పేర్కొన్న ప్రకారం కొత్త, పాత వాహనాలన్నింటికీ ఈ మార్పు వర్తించనుంది. డీజిల్‌ సెస్‌, బస్సు చార్జీలు, విద్యుత్‌ చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెంచింది. తాజాగా వాహనాల లైఫ్‌ టాక్స్‌ను కూడా పెంచాలని గతంలో మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులను జారీ చేశారు. ఈ లైఫ్‌ పెంపు నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. 1400 కోట్లు అదనపు ఆదాయం సమకూరనుంది. రూ. 50 వేల రూపాయల ఖరీదు దాటిన బైకులకు ఇప్పటి వరకు ఉన్న లైఫ్‌ టాక్స్‌ 9 శాతం కాగా దాన్ని 12 శాతానికి పెంచారు.

పాతవాహనాలపై కూడా 11శాతం పన్నును వసూలు చేయనున్నారు. త్రైమాసికానికి చెలించే పన్నును 25 శాతం పెంచారు. త్రీ వీలర్‌, ఫోర్‌ వీలర్‌ మొదలు మినీ బస్సు వరకు గతంలో ఉన్న రెండు శ్లాబ్‌లను నాలుగు శ్లాబ్‌లుగా విభజించారు. కొత్త వాహనాలైతే రూ. 5 లక్షల లోపు ఉంటే వాహనాలకు 13 శాతం, రూ. 10 లక్షల లోపు అయితే 14 శాతం, రూ. 20 లక్షల లోపు అయితే 17 శాతం, రూ. 20 లక్షలు దాటితే 18 శాతం చొప్పున పెంచారు. పాత వాహనాలను కొత్త వ్యక్తుల పేరుపై రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్లయితే వాటి వయసుకు అనుగుణంగా లైఫ్‌టాక్స్‌లో సవరణలు చేశారు. సరుకు రవాణా కాకుండా ప్యాసెంజర్లను తీసుకు వెళ్ళే కమర్షియల్‌ వాహనాలకు కూడా లైఫ్‌ టాక్స్‌లో మార్పులు చేశారు. 10 మంది కంటే ఎక్కువ మందిని తీసుకు వెళ్ళే వాహనాలకు అదనంగా 2 శాతం టాక్స్‌ను విధించారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement