Thursday, April 25, 2024

టాటా వెూటార్స్‌ రికార్డ్‌ సేల్స్‌

చిప్‌ కొరతకు సంబంధించిన సవాళ్లు ఉన్నప్పటికీ దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్‌ డిసెంబర్‌ 2021లో కోలుకుంది. పీవీ (ప్యాసింజర్‌ వెహికిల్‌) సేల్స్‌లో హ్యూందాయ్‌ని టాటా మోటార్స్‌ అధిగమించింది. దీంతో అత్యధిక పీవీ సేల్స్‌ చేసిన కంపెనీల జాబితాలో రెండో స్థానానికి చేరింది. నెలవారీగా డిసెంబర్‌ 2021లో ఇప్పటివరకు అత్యధిక స్థాయి అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ వివరించింది. ఇక అక్టోబర్‌ – డిసెంబర్‌ త్రైమాసికంలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. వార్షిక విక్రయాలకు సంబంధించి కూడా 2021లో అమ్మకాలే అధికంగా ఉన్నాయని కంపెనీ గణాంకాలు స్పష్టం చేశాయి. డిసెంబర్‌ 2021లో 35,300 యూనిట్లు విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. ఇదే డిసెంబర్‌లో దక్షిణకొరియా కారు తయారీ కంపెనీ హ్యూందాయ్‌ మోటార్‌ ఇండియా 32,312 యూనిట్లను విక్రయించింది. అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో టాటా మోటార్స్‌ 99,000 వాహనాలు విక్రయించగా 2021 ఏడాది మొత్తానికి 3.31 లక్షల వాహనాలు అమ్మినట్టు కంపెనీ పేర్కొంది.

సెమీ కండక్టర్ల చిప్‌ కొరత నేపథ్యంలో ఉత్పత్తి తగ్గినప్పటికీ ఈ త్రైమాసికంలో వాహన విక్రయాలు సరికొత్త మైలురాళ్లను అందుకున్నాయని టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ ప్యాసింజర్‌ వెహికిల్‌ బిజినెస్‌ యూనిట్‌ ప్రెసిడెంట్‌ శైలేష్‌ చంద్ర అన్నారు. అక్టోబర్‌ 2021లో ఆవిష్కరించిన టాటా పంచ్‌కు కస్టమర్ల నుంచి భారీ స్పందన వచ్చిందని ఆయన చెప్పారు. కాగా 2021లో హ్యూందాయ్‌ మోటార్స్‌ ఇండియాపై చిప్‌ కొరత తీవ్రమైన ప్రభావం చూపింది. చిప్‌ కొరత ఒత్తిళ్ల కారణంగా ఉత్పత్తి తగ్గించాల్సి వచ్చింది. గత కొన్ని నెలల్లో ఎలాంటి ఉత్పత్తి లేని నెలలు కూడా ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే సవాళ్లు ఉన్నప్పటికీ మెరుగ్గానే రాణించామని హ్యూందాయ్‌ ప్రతినిధి గార్గ్‌ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement