Thursday, April 18, 2024

టార్గెట్ కాంగ్రెస్.. వలపన్ని లాగుతున్న కమలదళం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రెండు తరాల రాజకీయ నేపథ్యం కల్గిన ‘మర్రి’ కుటుంబం నుంచి శశిధర్ రెడ్డి కమలదళంలో చేరికతో అటు కాంగ్రెస్‌‍తో పాటు ఇటు బీజేపీలోనూ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శశిధర్ రెడ్డి బాటలో మరికొందరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న సమాచారంతో అప్రమత్తమైన కాంగ్రెస్ నాయకత్వం, పీసీసీ కొత్త కార్యవర్గంతో పాటు పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూర్పు కోసం కసరత్తు చేపట్టింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ తమ సొంత బలం సరిపోదని, ఇతర పార్టీల్లోని బలమైన నేతలను చేర్చుకుంటేనే ప్రయోజనం ఉంటుందని లెక్కలు వేస్తోంది. ఈ క్రమంలో ఆకర్ష్ మంత్రాన్ని ముందుగా కాంగ్రెస్ నేతలపై ప్రయోగిస్తోంది.

‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నేపథ్యంలో ఆ పార్టీ నేతలను మాత్రం ముట్టుకోవద్దని నిర్ణయించినట్టు తెలిసింది. ఇందుకు నేతలు చెబుతున్న కారణం మాత్రం మరోలా ఉంది. సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అలాంటివారిని చేర్చుకుంటే బీజేపీ వచ్చే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువని కమలనాథులు సూత్రీకరిస్తున్నారు. అయితే ఎన్నికలు సమీపించినప్పుడు టికెట్ ఆశించి దక్కించుకోలేకపోయిన బలమైన నేతలు మాత్రం బీజేపీకి ఉపయోగపడతారని ఆ పార్టీ లెక్కలు వేసుకుంటోంది. ఆ తరహా నేతలు తమంతట తాముగా ముందుకొచ్చినప్పుడు చేర్చుకునే విషయాన్ని ఆలోచించవచ్చని భావించినట్టు తెలిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement