Wednesday, April 24, 2024

ప్రేమ మందిరం: తాజ్ మహల్ సందర్శనకు అనుమతి!

ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ అందాలను చూడాలనుకునే వారికి శుభవార్త. ప్రేమ మందిరంగా భావిస్తూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొనే తాజ్ మహల్ బుధవారం నుంచి తెరుచుకోనుంది. బుధవారం నుంచి పర్యాటకులు తాజ్ మహల్ ను సందర్శించేందుకు అవకాశం కల్పించనున్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తాజ్ మహల్ సందర్శన నిలిపివేశారు. అయితే, ఇప్పుడు వైరస్ మహమ్మారి వ్యాప్తి నియంత్రణలోకి రావడంతో క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నారు. ఈ క్రమంలో తాజ్ మహల్ సందర్శన అనుమతించాలని నిర్ణయించారు.

అయితే తాజ్ మహల్ చూడాలనుకునేవారు ఆన్ లైన్ లోనే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోన్ ద్వారా గరిష్టంగా 5 టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుంటుంది. తాజ్ మహల్ సందర్శనకు విడతకు 650 మందిని అనుమతించనున్నారు. తాజ్ మహల్ లోపల సందర్శకులు గుమికూడకుండా ప్రత్యేక సిబ్బందితో పర్యవేక్షణ ఏర్పాటు చేయనున్నారు. సందర్శకులు ఓ స్పాంజిపై నడిస్తే వారి పాదరక్షలు శానిటైజ్ అయ్యే విధంగా ఆధునిక వ్యవస్థలు అందుబాటులోకి తీసుకువచ్చారు.

 కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్కియలాజికల్ సర్వేఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) ఆధీనంలో ఉన్న స్మారక కట్టడాలు, మ్యూజియంల సందర్శనకు ప్రజలకు అనుమతించాలని నిర్ణయించారు. తాజ్ మహల్ తోపాటు దేశ వ్యాప్తంగా ఉన్న 3693 స్మారక మందిరాలు, 50 మ్యూజియంలు తిరిగి తెరవాలని నిర్ణయించింది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ సందర్శనకు వేసవిలో చాలా భారీ సంఖ్యలో వచ్చేవారు. అయితే లాక్ డౌన్ కారణంగా గత ఏడాదితోపాటు ఈ ఏడాది కూడా సందర్శకుల జాడ లేక తాజ్ మహల్ సందర్శకులపైనే ఆధారపడి జీవిస్తున్న అనేక మంది చిన్నా, పెద్ద వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. వారందరికి ఉపాధి కల్పించడంతోపాటు అభిమానులకు తాజ్ మహల్ సందర్శకులకు అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కాగా, కరోనా మహమ్మారి దెబ్బకు దేశంలోని అన్ని పర్యాటక స్థలాలు మూతపడిన సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ తో దేశంలో లక్షల చొప్పున కేసులు నమోదవడంతో తాజ్ మహల్ తో పాటు స్మారక చిహ్నాలు గత రెండు నెలలుగా పర్యాటకులకు అనుమతి లేదు. కాగా, దేశంలో ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో మళ్ళీ పర్యాటక స్థలాలు తెరుచుకోనున్నాయి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement