Thursday, November 7, 2024

Surprise – గ‌ల్లీలో రాహుల్‌! బార్బ‌ర్ షాపులో ప్ర‌త్య‌క్షం

సామాన్యుడిలా వెళ్లి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు
టెన్షన్ పడుతూ ట్రిమ్మింగ్ చేసిన బార్బర్
సాద‌కబాధకాలు తెలుసుకున్న కాంగ్రెస్ నేత‌
అప్యాయంగా కౌగిలించుకోవడంతో చెమర్చిన బార్బర్ కళ్లు
ట్విట్ట‌ర్‌లో వైర‌ల్‌గా మారిన వీడియో

ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్​: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ సామాన్య బార్బర్‌ను ఆశ్చర్యపరిచారు. బార్బర్ షాప్‌లోకి వెళ్లి గడ్డం ట్రిమ్మింగ్ చేయాలని సీటులో కూర్చున్నారు. ఎప్పుడూ టీవీలు, వార్తా మాధ్యమాల్లో కనిపించే రాహుల్ గాంధీ ఊహించని విధంగా తన షాప్‌కు రావడంతో ఆ బార్బర్ ఆశ్చర్యపోయాడు. విపరీతంగా టెన్షన్ పడ్డాడు. వణుకుతున్న చేతులతో ట్రిమ్మింగ్ చేశాడు. ఆసక్తికరమైన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా రాహుల్ గాంధీ తన ఎక్స్ వేదికగా షేర్ చేశారు. కాగా, శుక్రవారం పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ ఏరియాలో ఉన్న ‘క్లాసిక్ హెయిర్ సెలూన్’కు రాహుల్​ వెళ్లారు. బార్బర్‌ అజిత్‌తో మాట్లాడి అతడి సాదకబాధకాలు, కలలు, ఆశయాలను అడిగి తెలుసుకున్నారు.

క‌ష్టాలు అలాగే ఉన్నాయి..

- Advertisement -

నెలకు ₹14,000 నుంచి ₹15,000 మధ్య సంపాదిస్తున్నానని రాహుల్ గాంధీకి బార్బర్ అజిత్ చెప్పాడు. ఒక వ్యక్తి ₹15,000లతో ఏం ఆదా చేస్తాడు, ఏమీ మిగలదు కదా.. అని రాహుల్ అన్నారు. ఇల్లు గడవడానికి, షాప్ రెంట్‌కే సరిపోతున్నాయని అజిత్ చెప్పాడు. ఇంటి అద్దె ఎంతని రాహుల్ ప్రశ్నించగా.. ‘‘ఇంటి అద్దె ₹2,500. అయితే.. నేను దివ్యాంగుడిని కావడంతో ప్రభుత్వం నుంచి వస్తున్న ₹2,500లను అద్దెకు ఇచ్చేస్తున్నా. షాప్ పెట్టినప్పుడు మా భవిష్యత్తు మెరుగుపడుతుందని అనుకున్నా. ఎంతో కష్టపడి పని చేస్తున్నా. కానీ, మేము ఇంకా ఇక్కడే ఉన్నాం’’ అని అజిత్ బదులిచ్చాడు. తన భార్య హార్ట్ పేషెంట్ అని అతడు వాపోయాడు.

రాహుల్​ గాంధీకి ట్రిమ్​ చేయడం సంతోషంగా ఉంది..

రాహుల్ గాంధీ తన షాప్‌కు రావడంపై స్పందిస్తూ ‘‘పేదలమైన మాకు అండగా నిలిచేందుకు కనీసం ఈ వ్యక్తైనా ఉన్నారు. లేదంటే ఈ ప్రపంచంలో మమ్మల్ని ఎవరూ పట్టించుకుంటారు? రాహుల్ గారిని కలవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది’’ అని అజిత్ చెప్పాడు. కాగా ట్రిమ్మింగ్ పూర్తయిన అనంతరం షాప్ నుంచి బయటకు వెళ్లే ముందు బార్బర్ అజిత్‌ను రాహుల్ గాంధీ ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. దీంతో అజిత్ కళ్లు ఒక్కసారిగా చెమర్చాయి. రాహుల్​తో పాటు బయటకు వెళ్లి వీడ్కోలు చెప్పాడు.

ప్రతి పేదవాడి పరిస్థితి ఇలానే ఉంది..

ఇక ట్రిమ్మింగ్ చేస్తున్న సమయంలో అజిత్ చేతులు టెన్షన్‌తో వణికాయి. దీంతో అతడి చెయ్యి పట్టుకొని టెన్షన్ పడొద్దని, ఆందోళన వద్దు అని రాహుల్ అన్నారు. ఔను సార్ బాగా ఒత్తిడిగా ఉందని అతడు చెప్పాడు. కాగా, అజిత్ భాయ్ మాట్లాడిన నాలుగు మాటలు, అతడి కన్నీళ్లు నేడు దేశంలోని కష్టపడి పనిచేసే ప్రతి పేద, మధ్యతరగతి వ్యక్తుల కథను చాటి చెబుతున్నాయని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ రాసుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement