Friday, March 29, 2024

వార్నర్‌ను పక్కన పెట్టిన ఎస్‌ఆర్‌హెచ్..‌

రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు నిన్నటి వరకూ కెప్టెన్‌గా ఉన్న డేవిడ్‌ వార్నర్‌కు తుది జట్టులో  చోటు దక్కలేదు. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కటే విజయం.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంతో ఉన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కఠిన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు పేలవ ప్రదర్శనకు బాధ్యుడిని చేస్తూ ఏకంగా జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై వేటు వేసింది. టీ20 స్పెషలిస్టు, ఐపీఎల్‌ అమోఘమైన రికార్డు కల్గి ఉన్న వార్నర్‌ను పక్కన పెట్టేసి బరిలో దిగింది. ఈ మ్యాచ్‌లో మూడు మార్పులతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్‌ విలియమ్సన్‌ ప్రకటించాడు. అందులో వార్నర్‌, సుచిత్‌, కౌల్‌లకు తుది జట్టు నుంచి తప్పించినట్లు పేర్కొన్నాడు. వారి స్థానాల్లో నబీ, భువనేశ్వర్‌ కుమార్‌, సామద్‌లను జట్టులోకి తీసుకుంటున్నట్లు తెలిపాడు. ఇక కెప్టెన్సీ మార్పు అనేది ఆకస్మికంగా జరిగిందన్న విలియమ్సన్‌.. చిన్న చిన్న మార్పులకు శ్రీకారం చుట్టి పోరుకు సిద్ధమైనట్లు పేర్కొన్నాడు.

నిన్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. జట్టుకు మూలస్థంభంవంటి డేవిడ్‌ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించింది. అతని స్థానంలో లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని ప్రకటించింది. ఇప్పటి వరకు సన్‌రైజర్స్‌ 6 మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిపోయి కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచింది. తమ అధికారిక ప్రకటనలో వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడంపై సన్‌రైజర్స్‌ యాజమాన్యం ఎలాంటి కారణాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. ఇప్పుడు వార్నర్‌కు తుది జట్టులో కూడా చోటు ఇవ్వకపోవడంతో అతనిపై వేటు తప్పదనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చినట్లయ్యింది.

 

Advertisement

తాజా వార్తలు

Advertisement