Saturday, November 26, 2022

సుధీర్ గాలోడు మూవీ రివ్యూ.. హిట్టా.. ఫట్టా

గాలోడు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకి వ‌చ్చాడు సుడిగాలి సుధీర్.. మ‌రి ఈ చిత్రం సుధీర్ కి విజ‌యాన్ని అందించిందా లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం..

- Advertisement -
   

కథ.. సుడిగాలి సుధీర్‌ జైల్లోకి రావడంతో ఈ సినిమా మొద‌ల‌వుతుంది. జైలుకి ఎందుకొచ్చావ్‌ అనే ప్రశ్నతో ఫ్లాష్‌ బ్యాక్‌ స్టార్ట్ అవుతుంది. పనీపాట లేకుండా ఊర్లో అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు రాజు(సుడిగాలి సుధీర్‌). ఆటిట్యూడ్‌, యారోగెంట్‌ ఉన్న రాజుని నిద్ర లేపితే నచ్చదు. అలా లేపితే తండ్రినైనా తంతాడు. అలాంటి మొరటోడు పేకాటలో జరిగిన గొడవలో ఊరి సర్పంచ్‌ కొడుకుని కొట్టడంతో అతను చనిపోతాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో హైదరాబాద్‌కి వస్తాడు. ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఆకలి చంపేస్తుంది. బిక్షం అడుక్కునే సప్తగిరి వద్ద డబ్బులు కొట్టేసి కాలేజ్‌ స్టూడెంట్‌ శుక్లా (గెహానా సిప్పి) కంట్లో పడతాడు. తరచూ గొడవలు పడుతూ కనిపించడంతో శుక్లా అతన్ని ఆఫీస్‌ బాయ్‌గా పనిలో పెడుతుంది. అక్కడ చెత్త చేసి జాబ్‌ పోగొట్టుకుంటాడు. మళ్లీ అల్లరిగా తిరిగే క్రమంలో ఓ ఆపద నుంచి శుక్లాని కాపాడతాడు. దీంతో అతన్ని తన ఇంట్లోనే కార్‌ డ్రైవర్‌గా జాబ్‌ పెట్టిస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం, స్నేహం మరింతగా పెరిగి ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ నెక్ట్స్ లెవల్‌లోకి వెళ్లే క్రమంలో ఊర్లో సర్పంచ్‌ కొడుకు హత్య కేసులో జైలుకి వెళ్తాడు. మరి తన ప్రేమ పరిస్థితేంటి? జైలు నుంచి రాజు బయటకు వచ్చాడా? తన ప్రేమ, హత్య కేసులు ఎలాంటి మలుపులు తిరిగాయనేది మిగిలిన కథ.

విశ్లేషణ.. సుడిగాలి సుధీర్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాఫ్ట్ వేర్‌ సుధీర్‌ డైరెక్టర్‌ రాజశేఖర్‌ పులిచెర్ల ఈ సినిమాని రూపొందించారు. అయితే ఈ కథని లాక్‌ డౌన్‌ని ముందు ఎంపిక చేసినట్టు ఇంటర్వ్యూలో సుధీర్‌ చెప్పాడు. మాస్‌ హీరోగా ఎలివేట్‌ అయ్యేందుకు సుధీర్‌ చేసిన ప్రయత్నం. దర్శకుడు అదే స్టయిల్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఓ పెద్ద మాస్‌ హీరోని దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగా సినిమా ఆద్యంతం సాగింది. సుధీర్‌కి బుల్లితెరపై స్టార్‌ ఇమేజ్‌, విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఆ ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా టేకింగ్‌ ఉండటం గమనార్హం. అయితే కథ పరంగా ఇదొక రెగ్యూలర్‌ మూవీనే. కొత్తదనం చెప్పడానికి ఏం లేదు. మాస్‌ యాక్షన్‌ కమర్షియల్‌ మూవీలు ఎలా ఉంటాయో అలానే సాగుతుంది. కాకపోతే సుధీర్‌ లాంటి అప్‌కమింగ్‌ హీరోకి శృతి మించిన ఎలివేషన్లే కాస్త ఇబ్బంది పెట్టే అంశాలు. ఓపెనింగ్‌ ఎలివేషన్లే మరీ ఓవర్‌గా అనిపిస్తుంటాయి. హీరో ఎలివేషన్లకంటే కథపై దృష్టి పెట్టి ఉంటే ఇంకా బాగుండేది. సుధీర్‌ తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. మరోవైపు హీరోయిన్‌ ఫ్రెండ్‌, సుధీర్‌ మధ్య వచ్చే సన్నివేశాలు జబర్దస్త్ని గుర్తు చేస్తాయి. సినిమాకి ఇది హైలైట్‌గా నిలిచింది. సుధీర్‌ అంటే ఆయన్నుంచి ఫ్యాన్స్ కామెడీ ఎక్స్ పెక్ట్ చేస్తారు. తన మార్క్ కామెడీ ఇందులో ఆశించిన స్థాయిలో ఉండదు. యాక్షన్‌ సినిమా చేసిన ప్రయత్నం కాబట్టి దర్శకుడు కూడా ఆ దిశగా పెద్దగా ఫోకస్ పెట్టలేదు. కానీ ఛాన్స్ ఉన్న చోట మాత్రం గట్టిగానే ట్రై చేశాడు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారనే చెప్పాలి. ఓవరాల్‌గా ఇది రెగ్యూలర్‌ మాస్‌ కమర్షియల్‌ సినిమా అయినప్పటికీ సుధీర్‌ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

నటీనటులు.. రాజు అలియాస్‌ రజనీకాంత్ పాత్రలో సుడిగాలి సుధీర్‌ అదరగొట్టారు. మొరటోడుగా, గాలోడు పాత్రకి యాప్ట్ అనిపించేలా పాత్ర తీరుతెన్నులను తీర్చిదిద్దడం విశేషం. తన పాత్రలో సుధీర్‌ జీవించారు. ఎలివేషన్లు ఎక్కువైనా తన భుజాలపై సినిమాని మోశారు. ఆయన చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి. కొన్ని పవర్‌ఫుల్‌గా, కొన్ని సెంటిమెంటల్‌గా ఉండటంతో సుధీర్‌ పాత్రలోని నిజాయితీని ఆవిష్కరించాయి. తన లవర్‌గా శుక్లా పాత్రలో గెహనా సిప్పి ఫర్వాలేదనిపించింది. బిక్షగాడిగా, చివర్లో లాయర్‌గా సప్తగిరి అదరగొట్టారు. మరోవైపు హీరోయిన్‌ ఇంట్లో వంట వాడిగా షకలక శంకర్‌ సైతం రఫ్ఫాడించారు. ఇతర పాత్రలకు పెద్దగా ఆస్కారం లేకపోయినా ఉన్నంతలో ఓకే అనిపించారు.

టెక్నీకల్‌..దర్శకుడు రాజశేఖర్‌ మాస్‌ దర్శకుడిగా సక్సెస్‌ అయ్యాడు. కథ ఎంపికలోనే జాగ్రత్త వహించి ఉండాల్సింది. దీంతో నిజాయితీగా చేసిన ప్రయత్నం కూడా తేలిపోయింది. ట్విస్ట్ లు, టర్న్‌, కామెడీ అంశాలతో సినిమా సాగితే సినిమా నెక్ట్స్ లెవల్‌లోకి వెళ్లేది. ఉన్నంతలో సన్నివేశాలను రక్తికట్టించే ప్రయత్నం చేశాడని చెప్పాలి. డైలాగ్స్ బాగున్నాయి. పవర్‌ఫుల్‌గా, ఎమోషనల్‌గా, సెంటిమెంటల్‌గా ఎక్కడ ఎలా ఉండాలో అలా మోతాదు మించికుండా హైలైట్‌ అయ్యేలా ఉండటం సినిమాకి ప్లస్‌ అయ్యాయని చెప్పొచ్చు. రాంప్రసాద్‌ కెమెరా వర్క్ బాగుంది. రిచ్‌గా తీశారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకి ప్లస్‌ అయ్యాయింది. మాస్‌ సాంగ్‌, రొమాంటిక్‌ సాంగ్‌, బీజీఎం అదరగొట్టారు. ఎడిటింగ్‌ ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి. అక్కడక్కడ లాగ్‌ కట్‌ చేస్తే ఇంకా క్రిస్పిగా ఉండేది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. బాగా ఖర్చుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement