Friday, April 19, 2024

బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్ తొలిసారిగా సుఖోయ్‌నుంచి ప్రయోగం

న్యూఢిల్లి : బ్రహ్మోస్‌ క్షిపణి ప్రయోగాల్లో మరో అడుగు ముందుకుపడింది. తొలిసారిగా యుద్ధవిమానం సుఖోయ్‌ 30 నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్‌ క్షిపణి నిర్ణీత వ్యవధిలో బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విషయాన్ని రక్షణశాఖ ప్రకటించింది. ధ్వనికన్నా మూడురెట్ల వేగంతో దూసుకువెళ్లే బ్రహ్మోస్‌ క్షిపణి సాధారణంగా 290 కి.మి దూరంలోని లక్ష్యాన్ని ఛేదించేలా రూపొందించారు. కానీ ఇటీవలి కాలంలో మరింత ఆధునీకరించి 350 కి.మి. దూరాన్ని ఛేదించేలా మార్పులు చేశారు. ఇప్పుడు ఈ అత్యాధునిక బ్రహ్మోస్‌ క్షిపణిని తొలిసారిగా యుద్ధవిమానం నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగంతో భారత వాయుసేన మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే గగనతలంలో ఆధిపత్యానికి వెన్నుదన్నుగా నిలిచిన సుఖోయ్‌, ఇప్పుడు బ్రహ్మోస్‌ ప్రయోగ సామర్థ్యం నిరూపితమవడంతో యుద్ధక్షేత్రాల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం దక్కించుకుందని రక్షణశాఖ విశ్వాసం వ్యక్తం చేసింది. భూతలంపైన, సముద్ర జలాల్లోని లక్ష్యాలను ఇక నిశ్చింతగా ఛేదించే సత్తా సొంతం చేసుకుంది. గత నెలలో నౌకాదళం బ్రహ్మోస్‌ పరీక్షలు నిర్వహించింది. రష్యా సహకారంతో దేశీయంగా బ్రహ్మోస్‌ క్షిపణనులను భారత్‌ తయారు చేస్తున్న విషయం తెలిసిందే. భూ,గగన,జల మార్గాల్లో లక్ష్యాలను ఛేదించగల సత్తా బ్రహ్మోస్‌ కు ఉంది. పైగా వీటిని సబ్‌మెరైన్లు, విమానాలు, నౌకలు, భూతలంపైనుంచి ప్రయోగించొచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement