Thursday, April 25, 2024

ఏపీలో కోవిడ్‌కు విద్యార్ధిని బలి

ఏపీలో కోవిడ్ మహమ్మారికి విద్యార్థులు బలి అవుతున్నారు. కేజీహెచ్‌ కొవిడ్‌ వార్డులో బాలిక కీర్తి(14) కొవిడ్‌తో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసింది. రాత్రి 7గంటల సమయంలో బాలిక బాగుందని చెప్పిన వైద్యులు.. 8.30గంటల సమయంలో మృతి చెందిందని ప్రకటించడంతో బంధువులు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా సీతంపేట మండలం చాకలిపేటకు చెందిన సత్య, రాజు దంపతుల కుమార్తె కీర్తి 8వ తరగతి చదువుతోంది. ఆరు రోజుల క్రితం అస్వస్థతకు గురికావడంతో నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆరోగ్యం విషమించడంతో మూడు రోజుల క్రితం కేజీహెచ్‌కు తీసుకొచ్చారు. కీర్తి రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడం, పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కొవిడ్‌ వార్డులో చేర్చుకొని చికిత్స అందిస్తూ వచ్చారు.

బాలిక ఆరోగ్య స్థితిని కుటుంబీకులకు తెలియజేశామని వైద్యులు చెబుతుండగా, అటువంటిదేమీ లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి 7గంటలకు మంచినీరు తాగినట్లు చెప్పారని, గంట తర్వాత మృతి చెందిందని చెప్పడం అనుమానాలకు తావిచ్చిందన్నారు. ప్రత్యేకించి పిల్లల వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడం వల్లే బాలిక మృతి చెందిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని ఆసుపత్రి పర్యవేక్ష వైద్యాధికారిణి డాక్టర్‌ పి.మైథిలిని చెప్పారు. కాగా, మంగళవారం సాయంత్రం 15 నెలల పసిబిడ్డ మృతి చెందిన ఘటన మరువకముందే మరొకటి చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement