Thursday, March 28, 2024

Delhi | పోరాటమే మార్గం.. మండల్ కమిషన్ సిఫార్సుల కోసం ఉద్యమం : బీసీ సంక్షేమ సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న వెనుకబడి వర్గాల (ఓబీసీ) సమగ్ర సామాజికాభివృద్ధి కోసం మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తామంటూ బీసీ సంక్షేమ సంఘం ప్రకటించింది. గురువారం ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలేతో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీల అధినేతలు సీతారాం ఏచూరి, డి. రాజాలను కలిశారు. తొలుత కేంద్ర మంత్రిని కలిసిన బీసీ సంక్షేమ సంఘం నేతల బృందం మండల్ కమిషన్ సిఫార్సులను ఇకనైనా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేదంటే ప్రజా ఉద్యమాన్ని నిర్మించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. అనంతరం సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసి తమ ఉద్యమానికి మద్ధతు కోరారు.

అలాగే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజాను కూడా కలిసి మద్ధతు అడిగారు. అనంతరం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జాజుల శ్రీనివాస్ గౌడ్.. బీసీల డిమాండ్ల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని సీపీఐ(ఎం) హామీ ఇచ్చిందని చెప్పారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలు కోసం జరిగే పోరాటానికి మద్ధతివ్వడంతో పాటు బిహార్ మాదిరిగా అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేపట్టాల్సిందిగా సీపీఐ డిమాండ్ చేస్తోందని అన్నారు. కేంద్ర మంత్రి అథవాలే సైతం బీసీల కులగణన డిమాండ్‌ను ఒప్పుకున్నారని, తాము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కుల గణన చేపట్టాలని కోరుతున్నట్టు చెప్పారని జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement