Thursday, April 25, 2024

Delhi: తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైల్వే ప్రాజెక్టుల జాప్యం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కారణంగా అనేక రైల్వే ప్రాజెక్టులు నత్తనడకన సాగుతున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి తెలుగు రాష్ట్రాల్లో వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా సంబంధిత విభాగాల రైల్వే ఉన్నతాధికారులను కేంద్ర మంత్రి పిలిపించి ప్రాజెక్టుల తాజా స్థితిగతులపై కిషన్ రెడ్డికి వివరించారు. ఈ భేటీ అనంతరం కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమి సేకరించి ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న జాప్యం కారణంగానే కీలక రైల్వే ప్రాజెక్టులు పూర్తికావడం లేదని ఆరోపించారు.

తెలంగాణ కోసం కేంద్రం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నప్పటికీ అర్థరహితమైన విమర్శలు చేస్తున్న కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు.. వివిధ రైల్వే ప్రాజెక్టుల విషయంలో తమ వైఫల్యాలను దాచిపెడుతున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ నగరం లోపల, పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది పేద, మధ్యతరగతి ప్రజల పట్టణ రవాణా అవసరాలు తీర్చుతున్న ఎంఎంటీఎస్ రెండో విడత ప్రాజెక్టులో కేంద్రం తన వాటా మొత్తాన్ని అందజేసిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వ వాటా ప్రకారం రూ.545 కోట్లు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు దాదాపు రూ. 180 కోట్లు మాత్రమే అందించిందని తెలిపారు. ఈ విషయంలో ఎన్నిసార్లు లేఖలు రాసినా, రైల్వే బోర్డు అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిసినా కేసీఆర్ నుంచి సరైన స్పందన లేదని అన్నారు. కేసీఆర్ సర్కారు జాప్యం కారణంగా ఎంఎంటీఎస్-II ప్రాజెక్టు అంచనాలు రూ. 301 కోట్లు పెరిగాయని కిషన్ రెడ్డి తెలిపారు.

తెలంగాణలో ప్రాజెక్టుల భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వాన్ని వివరిస్తూ.. ఇంకా 350 హెక్టార్ల స్థలాన్ని సేకరించి ఇవ్వని కారణంగా, రూ.6,266 కోట్ల విలువైన, 500 కిలోమీటర్ల మేర రైల్వే పనులు ఆగిపోయాయని ఆరోపించారు. కాజిపేట-విజయవాడ అదనపు లైను గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో 184 కిలోమీటర్ల మేర ఉండే ఈ అదనపు రైల్వే లైనును దాదాపు రూ.1,952 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు డీపీఆర్ సిద్ధమవుతోందని, దీంతోపాటుగా కాజిపేట-కాగజ్‌నగర్ మధ్య దాదాపు రూ.2.063 కోట్లతో 202 కిలోమీటర్ల మేర అదనపు రైల్వే లైను, మనోహరాబాద్-కొత్తగూడెం మధ్య దాదాపు రూ. 2,250 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 150 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టులను త్వరిగతిన పూర్తిచేయాలని రైల్వే శాఖ మంత్రిని కోరినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం సహకరిస్తే వీలైనంత త్వరగా ప్రాజెక్టులను పూర్తిచేసేందుకు రైల్వేశాఖ మంత్రి భరోసా ఇచ్చారన్నారు.

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్
త్వరలోనే హైదరాబాద్ నుంచి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు సేవలను ప్రారంభించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ముందస్తుగా హైదరాబాద్-విశాఖపట్టణం, హైదరాబాద్-తిరుపతి, హైదరాబాద్-బెంగళూరు రూట్లలో ఏదో ఒక మార్గంలో ఈ సేవలు మొదలవుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యధిక వేగంతో నడిచే ఈ రైలుకు తగ్గట్టుగా రైల్వే ట్రాక్‌ను పటిష్టం చేయాల్సి ఉంటుందని, ఆ దిశగా ట్రాక్ పటిష్టం చేసేందుకు త్వరలోనే చర్యలు చేపడతామని రైల్వే మంత్రి తెలిపారన్నారు. దీంతోపాటుగా వివిధ రైళ్ల పొడగింపుపై కోరగా.. రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇకపోతే పర్యాటక, సాంస్కృతిక శాఖ తరఫున రాయాయణ్ సర్క్యూట్, బుద్ధిస్ట్ సర్క్యూట్ వంటి రైళ్లను నడుపుతున్నట్టుగా అంబేడ్కర్ సర్క్యూట్ (మౌ, నాగ్ పూర్, ఢిల్లీ, ముంబై) ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన అన్నారు.

ఎంత డబ్బు వెదజల్లినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా…
మునుగోడు ఉప ఎన్నికల్లో పరిస్థితిపై విలేకరులు ప్రశ్నించగా.. ‘టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి రంగంలోకి దిగినా బీజేపీదే విజయం. అంగట్లో గొర్రెలను కొన్నట్లుగా మునుగోడు ఓటర్లను టీఆర్ఎస్ కొంటోంది. ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు. ఎంత డబ్బు వెదజల్లినా, ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసినా, బెదిరింపులకు పాల్పడినా సరే.. ప్రజలంతా కల్వకుంట్ల కుటుంబానికి సరైన బుద్ధి చెబుతారు’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంటు ఎన్నికలప్పుడే టీఆర్ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని, 17 సీట్లలో ఎనిమిదింటిలో టీఆర్ఎస్ ఓడిపోయిన విషయాన్ని మరవొద్దన్నారు. తర్వాత జరిగిన దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ప్రజలు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు మొగ్గుచూపిన విషయం అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు మునుగోడు ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించుకుని వారి రేపటి బంగారు భవిష్యత్తుకు బాటలు పరచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement