Wednesday, November 29, 2023

సొంతింటి పథకానికి శ్రీకారం..! సీఎం కేసీఆర్‌ ఆమోదానికి ఫైల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నియోజవకర్గాల్లో సొంత జాగా ఉండి… ఇల్లులేని వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షలు ఇస్తాం.. ఎమ్మెల్యేలు లబ్దిదారుల ఎంపిక ప్రక్రియలో ఉండండి అని మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ శాసనసభ్యులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఈ పథకంపై ప్రజల్లో ఆశక్తి పెరిగింది. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లతోపాటు సొంత స్థలం ఉన్నవారికి రూ.3లక్షల ఆర్ధిక సాయం అందజేతకు సర్కార్‌ సిద్ధమవుతున్నది. ఈ పథకం పాతదే అయినప్పటికీ ఈ ఏడాదే దీనిని ఫోకష్‌ చేసి ప్రారంభించే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నది. అర్భన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఈ పథకాన్ని ఎలా అమలు చేయనున్నారు…ఎన్ని విడతల్లో సాయం అందించాలనే అంశంపై పరిశీలన చేస్తున్నారు. ఈ పథకం అమలులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యతదక్కేలా రిజర్వేషన్లు అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10శాతం చొప్పున మొత్తం ఇండ్లలో వాటాను వర్తింపజేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఈ ప్రతిపాదనలపై సీఎం కేసీఆర్‌ఖ తుది ఆమోదం తెలపాల్సి ఉంది. ఫైల్‌ సీఎం కార్యాలయాలనికి చేరడంతో ఈ పథకంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెండు మూడు రోజుల్లో సీఎం కేసీఆర్‌ ఆమోదంతో తక్షణమే పథకం అమలులోకి రానుందని తెలిసింది.

- Advertisement -
   

పేదల సొంతింటి కల నెరవేర్చేలా…

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సొంత ఇళ్లులేని నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల ఇండ్లను పూర్తి చేసి దాదాపుగా పంపిణీ చేశారు. ఇదిలా ఉండగా సొంత స్థలం ఉండి ఆర్ధికంగా స్తోమతలేని నిరుపేదలకు సొంత ఇంటికి ఆర్ధికంగా చేయూతనందించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ఏడాదిలోనే ఈ పథకాన్ని ఎలాగైనా ప్రారంభించాలనే పట్టుదలతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఎంత భారమైనా సరే నిరుపేదల జీవితాల్లో సొంతింటి కలను సాకారం చేసి వారి జీవితాల్లో ఆత్మవిశ్వాసం పెంపొందింపజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆర్ధిక శాఖకు, గృహనిర్మాణ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు వీలుగా విధివిధానాల రూపకల్పనపై కసరత్తు ముమ్మరం చేశారు.

రూ. 3లక్షలు…నాలుగు విడతల్లో…

సొంత ఇల్లు నిర్మించుకోవాలని భావిస్తున్న వారికి రూ. 3లక్షలను నాలుగు విడతల్లో ప్రభుత్వం విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీసం 75 చదరపు గజాలు, పట్టణ ప్రాంతాల్లో కనీసంగా 50 గజాలు ఉండాలని తొలుత నిర్ణయించినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్దం అయిన వెంటనే సీఎం కేసీఆర్‌కు నివేదించనున్నారు. ముఖ్యమంత్రి ఆమోదంతో ఈ నెలలోనే పథకం అమలులోకి రానుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం అందించనున్న రూ. 3లక్షల ఆర్ధిక సాయం ఇంటి నిర్మాణంలో దశలవారీగా అందించనున్నారు. బేస్‌మెంట్‌, గోడలు, శ్లాబ్‌, ఫినిషింగ్‌ ఇలా నాలుగు దశల్లో రూ. 75వేల చొప్పున చెల్లించనున్నట్లు సమాచారం. 2022-23 వార్షిక బడ్జెట్‌లో ఇప్పటికే ఈ పథకాన్ని నాలుగు లక్షల మంది లబ్దిదారులకు అందించాలని ప్రణాళిక వేసుకోగా తాజాగా అందుకు వీలుగా విధివిధానాలు సిద్దమవుతున్నాయి.

సీఎం కేసీఆర్‌ ఆమోదం లభించిన వెంటనే నియోజకవర్గానికి మూడు వేల మందికి సాయం అందించనున్నారు. గతంలో ఏదేని పథకంలో భాగంగా ఇండ్లు పొందినవారు ఈ పథకానికి అనర్హులుగా ప్రభుత్వం వెల్లడించింది. లబ్దిదారులు ఖచ్చితంగా తెల్లరంగు రేషన్‌ కార్డును కల్గి ఉండాలి. తెలంగాణ స్టేట్‌ టెక్నాలాజికల్‌ సర్వీసెస్‌ సహకారంతో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. మండల, జిల్లా స్థాయిల్లో కో ఆర్డినేటర్లను కూడా నియమించే అవకాశం ఉంది. ఇప్పటికే రూ. 12వేల కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన నేపథ్యంలో నిధుల విడుదలకు పెద్దగా అడ్డంకులు లేకుండా పోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement