Friday, April 19, 2024

హస్తినలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఈ నెల 12న అంకురార్పణతో ప్రారంభం..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానంవారి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ముస్తాబవుతోంది. మందిర్‌మార్గ్‌లోని బాలాజీ ఆలయంలో టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి ఛైర్‌పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కమిటీ సభ్యులతో కలిసి ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాల వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న అంకురార్పణతో ప్రారంభయ్యే బ్రహ్మోత్సవాలు 22న పుష్పయాగంతో ముగియనున్నాయి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవం నిర్వహిస్తామని ప్రశాంతి రెడ్డి తెలిపారు. రెండేళ్ల విరామం తర్వాత కోవిడ్-19 నియమ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రెండో రోజు 13వ తేదీన ఉదయం గం. 8.30 నుంచి 9.00 మధ్య ధ్వజారోహణం, సాయంత్రం గం. 7.30 నుంచి 8.30 మధ్య పెద్దశేషవాహనం సేవలు నిర్వహించనున్నారు. 14వ తేదీన ఉదయం చిన్నశేషవాహనం, సాయంత్రం హంసవాహనం మీద స్వామివారిని ఊరేగించనున్నారు. 15వ తేదీన ఉదయం సింహవాహనం, సాయంత్రం ముత్యాల పందిరి వాహనం, 16 ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహన సేవలుంటాయి. 17న ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గం. 5.00 నుంచి గం. 7.00 వరకు కళ్యాణోత్సవం, గం. 7.30 నుంచి 8.30 వరకు గరుడ వాహనం సేవలు నిర్వహిస్తారు. 18వ తేదీ ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం గజ వాహనం, 19వ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం, సాయంత్రం చంద్రప్రభ వాహన సేవలు జరగనున్నాయని వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వివరించారు. 20వ తేదీ ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వ వాహనం, 21 ఉదయం చక్రస్నానం, సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. చివరి రోజైన 22న సాయంత్రం గం. 6.00 నుంచి 8.00 వరకు పుష్పయాగం జరగనుంది. బ్రహ్మోత్సవాలకు రెండ్రోజుల ముందు 10వ తేదీన ‘కోయిల్ అళ్వార్ తిరుమంజనం’ సేవ నిర్వహించనున్నట్టు చెప్పారు.

వెంకయ్య నాయుడికి ఆహ్వానం

కన్నులపండువగా జరగనున్న ఈ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఢిల్లీలోని పలువురు వీఐపీలను ఆహ్వానిస్తున్నామని ప్రశాంతి రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా మీడియా సమావేశం అనంతరం ఉపరాష్ట్రపతి నివాసానికి చేరుకుని వెంకయ్య నాయుడికి బ్రహ్మోత్సవాలను అందజేసి ఆహ్వానించారు. ఢిల్లీలోని బ్రహ్మోత్సవాల్లో ఢిల్లీలోని దక్షిణాదివారితో పాటు ఉత్తరాది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రశాంతి రెడ్డి విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలన్నింటినీ ఉచితంగానే నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. అలాగే లడ్డూ ప్రసాదాల విక్రయానికి కౌంటర్లను ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. ఆసక్తిగలవారు స్వచ్ఛందంగా బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి సేవల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement