Tuesday, September 19, 2023

పాలమూరు పనుల్లో వేగం.. బీడు భూములకు సాగునీరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : నీళ్లే నినాదంగా, ప్రజల అకాంక్షలే లక్ష్యంగా సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కంకణ బద్ధమైంది. ఉత్తర తెలంగాణ లో కాళేశ్వరం నిర్మించి సాగు నీటి గోసను తీర్చిన సీఎం కేసీఆర్‌ దక్షిణ తెలంగాణలో వలసలతో వివవిల లాడుతున్న పాలమూరులో నోళ్లు తెరుచుకున్న బీడుభూముల దాహం తీర్చేందుకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను వేగంచేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవరోధాలు సృష్టించినా, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్లో కేసులున్నా వివాదాలు లేని మొదటి దశ పనులను పూర్తి చేసి డిసెంబర్‌ లో నీటిని విడుదల చేసేందుకు రాష్ట్ర నీటిపారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తి చేసింది.నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రతినిధుల బృందం పర్యవేక్షణ అనంతరం పనుల్లో మరింత వేగం పెంచి రెండవ దశ నీటిని 20023 యాసంగి నాటికి విడుదల చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లుతుంది. పర్యావరణ అనుమతులకోసం ప్రజాభిప్రాయాలను సేకరించడంతో పాటుగా కేంద్ర అటవీ శాఖ నుంచి మొదటి,రెండవ దశ అనుమతులు ఈ ప్రాజెక్టుకు లభించాయి. అయితే కృష్ణా నదీ వరదనీటిని ఈ ప్రాజెక్టుకు వినియోగించుకోవడాన్ని జీర్ణించుకోలేక అంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుతో ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో పర్యావరణానికి ముప్పువాటిళ్లుతుందని కేసు వేయడంతో పనుల్లో కొంత మేరకు జాప్యం జరిగింది. అయితే పర్యావరణ పరిరక్షణకోసం తీసుకుంటున్న చర్యల నివేదికను తెలంగాణ అడ్వకేట్‌ జనరల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కు సమర్పించడంతో పాటుగా కోరిన సమయం అనుమతులు పొందారు. త్వరలో జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ప్రతినిధుల బృందం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించేందుకు రానుందని అధికారులు చెప్పారు.

- Advertisement -
   

పర్యావరణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర ప్రభుత్వం అటవీశాఖ అనుమతులు ఇచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాతీయ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ కు ఫిర్యాదు చేయడంతో ఈ ప్రాజెక్టు ద్వారా ఎలాంటి పర్యావరణ నష్టాలు లేవని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తుంది. పర్యావరణానికి నష్టం వాటిళ్లకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకోసం పక్కా ప్రణాళికలను సిద్ధం చేసింది. రూ. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో 14వేల 891 కుటుంబాలకు పునరావసం కల్పించేందుకు నిధులు కేటాయించింది. సహాయ పునరావాసంకోసం రూ. 1566.86 కోట్లు, గ్రీన్‌ బెల్ట్‌ అభివృద్ధి కోసం రూ.29.64 కోట్లు, వ్యర్థాల నిర్వహణ కోసం రూ. 71. 25 కోట్లు, స్థానిక, ప్రాంత సమస్యల పరిష్కారానికి 30.35 కోట్లు, ఆయకట్టు అభివృద్ధికి రూ. 1321 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పాల్గొనే 7వేల మంది సంక్షేమానికి నిధులను తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. సముద్ర మట్టానికి 269.735 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు కు 13వేల 92 హెక్టార్ల భూమి అవసరం అయింది. అయితే ఈ స్థలాల్లో పురాతన కట్టడాలు, వన్యప్రాణీ సంరక్షణ కేంద్రాలు, ప్రత్యేకజాతుల పక్షులు, జంతువులు లేక పోవడంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిళ్లదనీ, ప్రాజెక్టు పూర్తి అయితే పర్యావరణం మరింత అభివృద్ధి చెందతుందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికల్లో స్పష్టం చేసింది.

పూర్తిఅవుతున్న రిజర్వాయర్ల నిర్మాణాలు

తెలంగాణ ఆవిర్భవించగానే సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సాగునీటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జూన11 2015 న భూత్‌ పూర్‌ మండలం కరివెన దగ్గర సీఎం కేసీఆర్‌ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకోసం మహబూబ్‌ నగర్‌, వికరాబాద్‌, రంగారెడ్డి, నల్గొండజిల్లాల కు లబ్ది చేకూర్చేవిధంగా రూ.56వేల కోట్ల రూపాయల పరిపాన అనుమతులతో ప్రాజెక్టునిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు రూ. 20 వేల కోట్ల రూపాయల పనులు జరిగాయి. నాగర్‌ కర్నూలు జిల్లాకొల్లాపూర్‌ మండలం లోని ఎల్లూరు దగ్గర శ్రీశైలం వరదనీటిని తోడి ప్రాజెక్టుల్లో నింపడం ప్రదాన నీటి వనరు. వర్షాకాలంలోని 60 రోజులు రోజుకు 1.5 టీఎంసీ నీటిని తోడి ప్రాజెక్టుల్లోకి పంపిస్తారు. ఈనీటిని ఐదు అంచల్లో ఎత్తిపోస్తారు.

చివరిదశకు చేరకున్న జలాశయాల పనులు

ప్రస్తుతం మొదటి దశపనుల్లోనిర్మిస్తున్న ఐదు జలాశయాల పనులు చివరిదశకు చేరుకున్నాయి. డిసెంబర్‌ లో నీటిని విడుదల చేయాలనే లక్ష్యం తో పనులు జరిగాయి. నార్లాపూర్‌ దగ్గర రిజర్వాయర్‌ నిర్మించి 6.647కిలోమీటర్ల వరదకాలువ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈ రిజర్వాయర్‌ 7.95 టిఎంసీల నీటినినిల్వచేసే అవకాశం ఉంది. అలాగే 5.91 టీఎంసీల సామర్థ్యంతో ఏదుల దగ్గర వీరాంజనేయ జలాశయం, 14.47 టీఎంససీల సామర్థ్యంతో వట్టెం దగ్గర వెంకటాద్రి జలాశయం, కరివెన దగ్గర 16.9 టీఎంంససీల సామర్థ్యంతో కురుమూర్తిరాయ జలాశయం, ఉద్దంపూర్‌ దగ్గర 15.61 టీఎంసీల సామర్థ్యంతో ఉద్దంపూర్‌ జలాశయం నిర్మాణ పనులు చివరిదశకు వచ్చాయి. వీటికి సంబంధించిన కాలువల పనులు జరుగుతున్నాయి. అలాగే నీటి తరలించేందుకు పంపుహౌజ్లు, పైపులైన్లు, కాలువలు, సొరంగాల పనులు వేగంగా జరుగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement