Thursday, April 25, 2024

నీల్వాయి రిజర్వార్‌ నిర్మాణ పనుల్లో వేగం.. సవరించిన అంచనా వ్యయం, కేంద్ర అనుమతుల్లో జాప్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నక్సల్స్‌ ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధిఅవకాశాలు మెరుగుపర్చే దిశలో ప్రభుత్వం వేస్తున్న అడుగులు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దట్టమైన అడవి ప్రాంతంలోని వేమన పల్లి అడవులు చుట్టూ వలయంగా ఉన్న నీల్వాయి రిజర్వాయర్‌ నిర్మాణాన్ని పూర్తి చేసి వేల ఎకరాలకు సాగునీరు అందించే దిశలో ప్రభుత్వం పనుల్లో నిమగ్నమైంది. ఒకప్పుడు నీల్వాయి అంటే పీపుల్స్‌ వార్‌ నక్సలైట్ల ప్రభావితప్రాంతంగా ప్రసిద్ధి చెందితే ప్రస్తుతం సస్యశ్యామలమైన భూములకు చిరునామాగా నిలిచింది.

రాష్ట్రప్రభుత్వం మారుమూల ప్రాంతాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టులనిర్మాణాలు చేపడుతుంటే ఒకవైపు ఏపీ అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వఆధీనంలోని పర్యావరణ అనుమతులు లభించక ప్రాజెక్టుల పనులు నిలిచిపోతున్నాయి. నీల్వాయి రిజర్వాయర్‌ వేమనపల్లి అడవిప్రాంతంలో ఉండటంతో ఢిల్లిలోని పర్యావరణం,అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ నియంత్రణలోని నేషనల్‌ వైల్డ్‌ లైఫ్‌ నుండి అనుమతుల్లో జాప్యం జరగడంతో ప్రాజెక్టు నిర్మాణ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతుంది. 13వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు మంచిర్యాల జిల్లా, నీల్వాయి దగ్గర జి-9 సబ్‌ బేసిన్‌, గోదావరి ఉపనది పెద్దవాగుపై నీల్వాయి ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రాభుత్వం ప్రారంభించింది.

- Advertisement -

దట్టమైన అడవుల మధ్య తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని సాగుభూములకు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం దశలవారిగా అనుమతులు ఆలస్యం చేయడంతో రూ. 90.50 కోట్ల అంచనా వ్యవయం ప్రస్తుతం రూ.211.32 కి సవరించి పనుల్లో ప్రభుత్వం వేగం పెంచింది. ప్రస్తుతం హెడ్‌ వర్క్‌ పూర్తి అయింది. కుడి, ఎడమకాల్వ కుడికాల్వల 15.10 కిలోమీటర్ల పనులు పూర్తి చేశారు. సరఫరాకుసంబందించి న 23 పనుల్లో ప్రస్తుతం 21 పూర్తి అయ్యాయి. అయితే ఎడమకాల్వ పనుల్లో మరో 13.1 కిలోమీటర్లు పూర్తి కావల్సిఉంది.

సమరించిన అంచనా వ్యయం రూ.211.32 తో మిగిలిన పనులు జూన్‌ 2023 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో నీటిపారుదల శాఖపనుల్లో వేగం పెంచినప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన అనుమతుల్లో జాప్యం అవుతుండటంతో లక్ష్యాన్ని ఛేదించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. అయితే ప్రస్తుతం 8.000 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాలువల పనులు కూడా వేగం పుంజుకున్నాయి అయితే ప్రాజెక్టు లక్ష్యం 13వేల ఎకరాలు కావడంతో జూన్‌చివరినాటికి పూర్తి చేయాలనే ప్టటుదలతో నీటిపారుదల శాఖ పనుల్లో వేగం పెంచింది. కేంద్రఅనుమతులు లభిస్తే ఒకప్పుడు తుపాకి మోతలు మోగిన నీల్వాయి పచ్చని పంటపొలాలకు చిరునామా అయ్యే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement