Sunday, October 6, 2024

Special Story గ‌నుల్లో ఘ‌నుడు! బ‌య‌ట‌ప‌డ్డ వెంక‌ట్‌రెడ్డి య‌వ్వారం

ఇది చిన్న కథ కాదంటున్న ఏసీబీ
వైసీపీ దోపిడీకి అన్ని విధాలా స‌హ‌క‌రించారు
మైనింగ్ మాఫియాకు వెన్నుద‌న్నుగా ఉన్నారు
వేల కోట్లు కొల్ల‌గొట్టేందుకు పెద్ద స్కెచ్ వేశారు
సుప్రీంకోర్టు, హ‌రిత ట్రిబ్యున‌ల్ చెప్పినా విన‌లేదు
చంద్ర‌బాబును ఇరికించాల‌ని త‌ప్పుడు ఫిర్యాదులు
కాంట్రాక్ట‌ర్ల‌తో లోపాయికారి ఒప్పందాలు
ఇసుక రీచ్‌ల‌లో హ‌ద్దుల‌ను చెరిపేశారు
భారీ యంత్రాల‌తో త‌వ్వుతున్నా చ‌ర్చ‌ల్లేవు
రెండు మూడు కాంట్రాక్టు సంస్థ‌ల‌కు మేలు
వైసీపీ పెద్ద‌ల‌కు టెండ‌ర్లు ద‌క్కేలా ప్లాన్‌
మైనింగ్ మాజీ చీఫ్ దురాగ‌తాలు అన్నీ ఇన్నీకావు
ద‌ర్యాప్తు నివేదిక‌ను బ‌య‌ట‌పెట్టిన ఏసీబీ

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌:

వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక, గనులు, ఖనిజ సంపదను అప్పనంగా పార్టీ పెద్దలకు కట్టబెట్టిన గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిని ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గురువారం రాత్రి అరెస్ట్ చేశారు. జగన్‌ హయాంలో ఇసుక విధానం ముసుగులో ఏకంగా ₹2,566 కోట్లు దోచేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఈ దోపిడీకి వెంకటరెడ్డి అన్ని విధాలా సహకరించారని తేల్చింది. ఇసుక కాంట్రాక్ట్‌ సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలు, మరికొందరు వ్యక్తులతో కలిసి వేల కోట్లు కొల్లగొట్టేందుకు ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. కొన్ని విష‌యాల్లో రూల్స్ మీరి పోయార‌ని, ఇసుక త‌వ్వ‌కాల విష‌యంలో సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యున‌ల్ చెప్పినా ప‌ట్టించుకోలేద‌ని నివేదిక‌లో పేర్కొంది.

- Advertisement -

సుప్రీంకోర్టు చెప్పినా ప‌ట్టించుకోలేదు..

ఇసుక తవ్వకాల్లో కాంట్రాక్ట్​ సంస్థలు యథేచ్ఛగా ఉల్లంఘనలకు పాల్పడినా వాటికి వెన్నుదన్నుగా నిలిచారని ఏసీబీ గుర్తించింది. ప్రభుత్వానికి బకాయిపడ్డ సొమ్ములు చెల్లించకుండానే ఆయా సంస్థల కాంట్రాక్టర్లు సమర్పించిన బ్యాంకు గ్యారెంటీలను వారికి వెనక్కి ఇచ్చేశారని నిర్ధరించింది. సుప్రీంకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను బేఖాతరు చేసి తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని తేల్చింది. వీటికి సంబంధించిన కీలక ఆధారాలు లభ్యమవడంతో ఆయన్ను అరెస్టు చేసింది.

చంద్రబాబుపై తప్పుడు ఫిర్యాదులు..

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌లో సీనియర్‌ సివిలియన్‌ స్టాఫ్‌ ఆఫీసరైన వెంకటరెడ్డి 2019లో ఏపీకి డిప్యుటేషన్‌పై వచ్చారు. తొలుత విద్యాశాఖలో కొనసాగారు. 2020 ప్రారంభంలో గనుల శాఖ సంచాలకుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఏపీఎండీసీకి ఎండీగానూ అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ రెండు పోస్టులను అడ్డం పెట్టుకుని వైసీపీ పెద్దలకు గనుల, ఖనిజ, ఇసుక దోపిడీకి సహకరించారు. అంతేకాకుండా 2014 -19 మధ్య టీడీపీ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగాయని దీనికి చంద్రబాబు బాధ్యుడ‌ని తప్పుడు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై సీఐడీలో అక్రమంగా కేసు నమోదు చేయించారు.

లోపాయికారి ఒప్పందాలు..

వైసీపీ అధికారం చేపట్టాక తొలుత ఏపీఎండీసీ ద్వారా ఇసుక తవ్వకాలు, విక్రయాలు జరిపారు. వెంకటరెడ్డి గనుల శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యాక ప్రైవేటు కాంట్రాక్ట‌ర్ల‌కు ఇసుక వ్యాపారం అప్పగించే విధానం తీసుకొచ్చారు. వైసీపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారే ఇసుక వ్యాపారం చేసేలా, వారికే టెండరు దక్కేలా నిబంధనలు సిద్ధం చేసి వారికే కట్టబెట్టారు. ఇసుక కాంట్రాక్టు సంస్థలైన జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమ సంస్థలకు పెద్ద మొత్తంలో ఇసుక కాంట్రాక్టులు ద‌క్కాయి.

అయినా చ‌ర్య‌ల్లేవు..
ఇసుక రీచ్‌ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయి. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయి. పర్యావరణ అనుమతులు లేకుండానే ఇష్టానుసారంగా తవ్వకాలు చేశాయి. ఆ అక్రమాలకు వెంకటరెడ్డి సహకరించార‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఆ సంస్థలు ముద్రించుకున్న వే బిల్లులు చేతిరాతతో ఇచ్చేందుకు వెంకటరెడ్డి అవకాశం కల్పించార‌ని తెలుస్తోంది. దీంతో ఆయా సంస్థలు ఇసుక తవ్వకాలు, విక్రయాలకు సంబంధించి ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చూపించి దోచుకున్న‌ట్టు స‌మాచారం. ఒప్పందం ప్రకారం ప్రతినెలా 1, 16వ తేదీల్లో ఆయా ప్రైవేటు సంస్థలు టెండరులో కోట్‌ చేసిన మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. వారు నెలల తరబడి సొమ్ము జమ చేయకపోయినా వెంకటరెడ్డి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. జేపీవీఎల్‌ సంస్థ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్టు గడువు 2023 మే నెలలోనే ముగిసిపోయింది. అయినా నవంబరు వరకు ఆ సంస్థే అనధికారికంగా కొనసాగేందుకు అవకాశం కల్పించిన‌ట్టు తెలుస్తోంది.

జేసీకేసీ, ప్ర‌తిమ ఇన్‌ఫ్రాకు పెద్ద ఎత్తున ల‌బ్ధి

2023 డిసెంబరు నుంచి తవ్వకాల బాధ్యతలు తీసుకున్న జేసీకేసీ, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలకు అనుచిత లబ్ధి కలిగించారు. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌, జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రతిమ ఇన్‌ఫ్రా సంస్థలు ఏకంగా 921 కోట్ల 51 లక్షల విలువైన ఇసుకను అక్రమంగా తవ్వేశాయి. ఈ దోపిడీకి వెంకటరెడ్డి సహకరించార‌నే స్ప‌ష్టం అవుతోంది. గనుల లీజులు ఆన్‌లైన్‌ ద్వారా కేటాయించే విధానాన్ని వెంకటరెడ్డి 2022లో తెచ్చారు. అప్పటి వరకు లీజులు మంజూరయ్యే దశలో ఉన్న దరఖాస్తులన్నింటిని ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టార‌ని తెలుస్తోంది. వైసీపీ నేతలకు చెందిన దరఖాస్తులకు మాత్రం ఆన్‌లైన్‌ వేలం విధానానికి ముందే లీజులు కేటాయించేలా చూశారు. గనులశాఖ నిర్వహించిన సీనరేజ్‌ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధానాన్ని వెంకటరెడ్డి తీసుకొచ్చార‌నే ఏసీబీ ద‌ర్యాప్తులో వెల్ల‌డ‌య్యింది.

వైసీపీ పెద్దలకే టెండ‌ర్లు ద‌క్కేలా అవ‌కాశాలు..

గనులశాఖలో ఎంతో మంది అధికారులు వెంకటరెడ్డి బాధితులే అన్న‌ది ఏసీబీ ద‌ర్యాప్తులో తేలింది. ఆయన చెప్పినట్లు వినని, అడ్డగోలుగా సంతకాలు చేయబోమని చెప్పిన అధికారులకు ప్రాధాన్యంలేని పోస్టులకు, ఇతర శాఖలకు బలవంతంగా పంపేవార‌ని తెలుస్తోంది. వర్కింగ్‌ ఎరేంజ్‌మెంట్‌ పేరిట ఓ చోట పోస్టింగ్‌ ఉంటే సుదూరంగా వేరొక చోట విధులు కేటాయించారు. రాయలసీమకు చెందిన వారిని ఉత్తరాంధ్ర జిల్లాల్లో కోస్తా జిల్లాలకు చెందినోళ్లకు రాయలసీమకు ఇలా పంపేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసులో వీజీ వెంకటరెడ్డి ఏ-1గా ఉన్నారు. జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ ప్రతినిధి అనిల్‌ ఆత్మారామ్‌ కామత్ ఏ-2, ప్రతిమ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ప్రతినిధి పి.అనిల్‌కుమార్ ఏ-3, జీసీకేసీ ప్రాజెక్ట్స్‌ అండ్‌ వర్క్స్‌ ప్రతినిధి ఆర్‌.వెంకట కృష్ణారెడ్డి ఏ-4, జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ ఏ-5 ఇలా ఇతరులు నిందితులుగా ఉన్నారు. వీరందరు కలిసి సాగించిన నేరపూరిత కుట్ర వివరాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement