Thursday, April 25, 2024

Big story | చెరువుల పండుగపై స్పెషల్​ ఫోకస్​.. ఇరిగేషన్​శాఖకు బాధ్యతలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆరుదశాబ్దాల నీటి గొసను దశాబ్దకాలంలో తీర్చి తెలంగాణ బీడుభూములను సాగుక్షేత్రాలుగా మార్చిన తెలంగాణ ప్రభుత్వం చెరువుల పండుగకు సర్వం సిద్ధం చేస్తుంది. నాడుపడావు పడ్డ భూములు నేడు మిషన్‌ కాకతీయతో సస్యశ్యామలమయ్యాయి. 46వేల 571 చెరువులు దశలవారిగా పునరుద్ధరించడంతో నాటి కాకతీయుల చెరువులు నేడు సముద్రాలను తలపిస్తూ 25లక్షల 92వేల 437 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటుగా భూగర్భజలాలు వృద్ధి చెందడంతో 680 టీఎంసీల నీటినిల్వలు భూముల్లో నిక్షిప్తమయ్యాయి. ఫలితంగా వేసవిలోను సుమారు ఐదు వందల చెరువులు మత్తడి దూకుతూ తెలంగాణ నీటి గోసను తీర్తుతున్నాయి.

పచ్చబడ్డపల్లెసీమలు చెరువుల పండుగకోసం ముస్తాబు అవుతున్నాయి. జనవాసం, జలాశయం, ఆలయం సిద్ధాంతంతో కాకతీయులు తెలంగాణ గడ్డపై లక్షాపైచిలుకు చెరువులను నిర్మించి సముద్రాలను తలపించే జలవనులను తెలంగాణకు సొంతం చేశారు. కాకతీయ గణపతిదేవుని కాలంలో చెరువుల దగ్గర జాతరలు చేసినట్లు చరిత్ర లభ్యమవుతుంది.జనవాసాలు జలాశయం దగ్గర నిర్మించిన ఆలయం దగ్గర జాతర జరుపుకునే సంప్రదాయాన్ని కాకతీయులు నెలకొల్పారు. ఈ ఆచారాన్ని తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పునరుద్ధరిస్తూ జూన్‌ 8న చెరువుల పండుగ ప్రకటించింది.

- Advertisement -

కాకతీయులు నిర్మించిన సుమారు లక్షాయాభైవేల చెరువుల్ల్లో ప్రస్తుతం 43వేల 870చెరువులు మిగిలాయి. ఈ చెరువుల్లో కాకతీయులతో పాటుగా చాళుక్యులు, కుతుబ్‌ షాహీలు నిర్మించిన చెరువులు ఉన్నయి. అలాగే కీసరలో శాతవాహనుల నాటి జలాశయాలు, హస్మత్‌ పేటలో మెగాలిథ్స్‌ కాలం నాటి చెరువులు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతాల్లో ఆంగ్లేయులు తవ్వించిన చెరువులు ఉన్నాయి. అయితే దాదాపుగా రాష్ట్రంలోని 12వేల 769 గ్రామపంచాయితీల్లో ప్రాచీనచెరువులు ఉన్నాయి. ప్రతిచెరువుకట్టలపై నాటి కాకతీయులు, లేదా చాళుక్యులు, ఆసఫ్‌ జాహీలు నిర్మించిన కట్టమైసమ్మ ఆలయాలు ఉన్నాయి.

కాకతీయులు ప్రవేశవేశపెట్టిన సంప్రదాయాన్ని కులీకుతుబ్‌ షాహీలు పాటించిన ఆధారాలు ఉన్నాయి. ఉదాహారణకు ఇబ్రహీం కులీకుతుబ్‌ షాహీ నిర్మించిన హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌ కింద కట్టమైసమ్మ దేవాలయం ఉంది. తెలంగాణ ప్రగతికి నిదర్శనంగా 43వేల 870 చెరువుల్లో మిషన్‌ కాకతీయ కింద 46వేల 571 చెరువులను దశలవారిగా పునరుద్ధరించడంతో ప్రస్తుతం 500 చెరువులు మత్తడి దూకుతున్నాయి. ఈ చెరువుల్లో 75 నుంచి 100 శాతం నిండుగా ఉన్న చెరువులు 8వేలు, 50నుంచి 75 శాతంవరకు నిండుగా ఉన్న చెరువులు 10వేలు మిగతా చెరుల్లో 50 శాతం నీళ్లు నిల్వఉండి సాగుభూములను సస్యశ్యామలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవతేదీన సాగునీటి దినోత్సవం, ఎనిమిదవ తేదీన చెరువుల పండుగను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేథ్యంలో చెరువుల పండుగ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామపంచాయితీల వారిగా ఉత్సవాలు నిర్వహిించేందుకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నియోజకవర్గాల వారిగా శాసనసభ్యులు, జిల్లామంత్రులు చెరువుల పండుగలో భాగస్వాములు కానున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, గ్రామీణ ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ సాంస్కృతిక శాఖ ఈ మేరకు సాంస్కృతిక కార్యక్రమాలను రూపొందిస్తోంది. అలాగే చెరువులు జలాశయాలను సాగునీటిపారుదలశాఖ విద్యుత్‌ అలంకరణలు చేసింది. కాకతీయుల కాలం నాటి చెరువుల పండుగ పునుద్ధరించడంతో పాటుగా అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. చెరువులదగ్గర బోనాలు, బతుకమ్మ, స్థానికంగా సాధించిన ప్రగతి పై నివేదికలు, తెలంగాణ ఆచారం మేరకు కట్టమైసమ్మ పూజలు, పోతురాజుల నృత్యాలతో పండుగ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగునీటి పారుదలశాఖ చెరువులపండుగ, సాగునీటి దినోత్సవం ఏర్పాట్ల కోసం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ ఎన్సీ నాగేందర్‌,సీఎంఓ ఓఎస్టీ నేతృత్వంలో ఏర్పాట్ల కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో నియోజకవర్గాలస్థాయిలో ఈఈ నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. మండలస్థాయిలో డీఈఈ నోడల్‌ అధికారులుగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

పటిష్టమైన ఏర్పాట్లు… నిర్వహణ కమిటీలు

సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా చెరువుల పండుగకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ చెప్పారు. ఆరవతేదీనాటికే అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయన్నారు. నియోజకవర్గాలవారిగా సాగునీటి రంగంలో సాధించిన ప్రగతి నివేదికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. చెరువుల పండుగలో అందరనీ భాగస్వాములను చేయనున్నట్లు రజత్‌ కుమార్‌ చెప్పారు.

పండుగకు సిద్ధమైన 12వేల 769 చెరువులు

రాష్ట్రంలోని జలాశయాలు, చెరువులను పండుగ కోసం సిద్ధం చేసినట్లు ఈఎన్‌ సీ (ఇరిగేషన్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటనెన్స్‌) నాగేందర్‌ చెప్పారు. చెరువుల సుందరీకరణ, పూడిక, కట్టల పరిశుభ్రత ఏర్పాట్లు పూర్తి అయ్యాయని చెప్పారు. ప్రభుత్వ అదేశాల మేరకు చెరువులపండుగకుభారీ ఏర్పాట్లు చేస్తోన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 12వేల 769 పంచాయితీల్లో ఈ పండుగనిర్వహణ ఏర్పాట్లు కొనసాగుతున్నాయన్నారు. చెరువుల పండుగలో ప్రగతినివేదికలు ఉంటాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌, ఇరిగేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రజత్‌ కుమార్‌ నేతృత్వంలో రాష్ట్రంలో జలసిరులు ఎగిసిపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతో గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలు, కులవృత్తులకు ప్రోత్సాహం ఉందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా ఈ పండుగలో పాల్గొనాలని నాగేందర్‌ పులుపు ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement