Sunday, December 1, 2024

TGSRTC | శైవ క్షేత్రాల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు : సజ్జనార్

టీజీఎస్ఆర్టీసీ మ‌రో గుడ్‌న్యూస్ చెప్పింది. కార్తీక మాసం సందర్భంగా ప్రసిద్ధ శైవక్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నామని టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

ఆర్టీసీ పనితీరు, కార్తీకమాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేష‌న్స్‌, మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకం తదితర అంశాలపై శనివారం హైదరాబాద్ బస్ భవన్ నుంచి ఎండీ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ…

కార్తీక మాసం, శబరిమల ఆప‌రేష‌న్స్ ఆర్టీసీకి ఎంతో ముఖ్యమని, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆది, సోమవారాల్లో శైవక్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, అందుకనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.

- Advertisement -

ఈ నెల 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని తెలిపారు. అలాగేఆంధ్రప్రదేశ్‌లోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల కోసం http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాల‌న్నారు. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్‌లను 040-69440000, 040-23450033లో సంప్ర‌దించాల‌ని సూచించారు.

బ‌స్ ఆన్ కాంట్రాక్ట్(బీవోసీ) చార్జీలు త‌గ్గింపు..

అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించామని సజ్జనార్ తెలిపారు. ప‌ల్లె వెలుగు కిలోమీటరుకు రూ.11, ఎక్స్‌ప్రెస్‌కు రూ.7, డీలక్స్‌కు రూ.8, సూపర్ లగ్జరీకి రూ.6, రాజధానికి రూ.7 చొప్పున తగ్గించినట్లు పేర్కొన్నారు. శబరిమల, శుభముహూర్తాలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు బుక్ చేసుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.

ఈ స‌మీక్షా స‌మావేశంలో సంస్థ చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్(సీవోవో) డాక్ట‌ర్ ర‌వింద‌ర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ లు మునిశేఖ‌ర్, వినోద్ కుమార్, ఫైనాన్స్ అడ్వైజ‌ర్ విజ‌య‌పుష్ఫ, హెచ్‌వోడీలు శ్రీదేవి, శ్రీధ‌ర్, వెంక‌న్న‌, సుధా ప‌రిమ‌ళ, విజ‌య‌భాస్క‌ర్, శ్రీనివాస‌రావుల‌తో పాటు వ‌ర్చ్‌వ‌ల్‌గా ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement