Saturday, April 20, 2024

త్వరలో స్వదేశీ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్.. భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ ను రూపొందించిన ఐఐటీ మద్రాస్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆత్మనిర్భర్ భారత్ పేరుతో పూర్తిగా దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు “భారత్‌లో తయారీ, భారత్ కోసం.. మిగతా ప్రపంచం కోసం” అనే నినాదంతో ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వం దేశీయంగా అభివృద్ధి చేసిన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను మంగళవారం పరీక్షించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ అభివృద్ధి చేసిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌కు ‘భారత్ ఆపరేటింగ్ సిస్టం’గా నామకరణం చేశారు. సంక్షిప్తంగా దీన్ని భారోస్ (BharOS)గా వ్యవహరించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న ఆండ్రాయిడ్, ఐ-ఓఎస్ (ఆపిల్ సంస్థ సొంత ఆపరేటింగ్ సిస్టమ్) తరహాలో ‘భారోస్’ పనిచేస్తుందని రూపకర్తలు చెబుతున్నారు.

- Advertisement -

ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేసిన రెండు మొబైల్ ఫోన్ల మధ్య వీడియో కాల్ చేసి ఆపరేటింగ్ సిస్టం పనితీరును కేంద్ర మంత్రులు పరీక్షించారు. కేంద్ర ఐటీ, టెలీకాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘భారోస్’ మొబైల్ ఫోన్‌తో వీడియో కాల్ చేశారు. ఆండ్రాయిడ్, ఐ-ఓఎస్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ ఆపరేటింగ్ సిస్టం ఉందని సంతృప్తి, సంతోషం వ్యక్తం చేశారు. డిజిటల్ ఇన్‌ఫ్రా సహా అన్ని రంగాల్లో ఇతర దేశాలపై ఆధారపడకుండా భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధాన మంత్రి ఆలోచనలను నిజం చేస్తూ ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రూపుదిద్దుకుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. బలమైన స్వదేశీ పరిజ్ఞానం, స్వయం సమృద్ధితో రూపొందించిన డిజిటల్ ఇన్‌ఫ్రాతో దేశంలోని నిరుపేదలే ఎక్కువగా లబ్ది పొందుతారని తెలిపారు. ప్రభుత్వ ఆలోచనలకు, విధానాలకు తగ్గట్టుగా పనిచేసేవారిని ప్రోత్సహించడం ప్రధాని మోదీ విలక్షణ పనితీరుకు నిదర్శనమని అన్నారు. నేడు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న డాటా ప్రైవేసీ భయాలను ఈ ఆపరేటింగ్ సిస్టమ్ పోగొడుతుందని, వ్యక్తిగత సమాచార భద్రతకు పెద్దపీట వేస్తూ రూపొందిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా భద్రత విషయంలో రాజీ ఉండదని ఆయన పేర్కొన్నారు. ఆపరేటింగ్ సిస్టం త్వరలోనే ప్రజా వినియోగంలోకి అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రులు ఆశాభావం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement