Friday, March 29, 2024

ఎపిలో సోసైటీల ఆస్తుల‌కు రెక్క‌లు…

అమరావతి, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – ఎంతో ఉదాత్త ఆశయంతో రాష్ట్రంలో విద్యాభివృద్ది కోసం కొందరు దాతలు నెలకొల్పిన సొసైటీలకు చెందిన విలువైన స్థలాలు, భూములు, ఆస్తులన్నీ ఇప్పుడు యదేచ్ఛగా విక్రయాలకు గురౌతున్నాయి. ఇందుకు ప్రభుత్వమే స్వయంగా ముందుకొచ్చి వారికనుకూల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో దాతల వారసులు తమ పూర్వీకులేర్పాటు చేసిన సొసైటీల్ని వ్యవస్థాపక లక్ష్యాలకనుగుణంగా విద్యాభివృద్ది కోసం నిర్వహించడానికి విరుద్దంగా ఆస్తుల్ని తెగనమ్ముకుని ఆర్ధికంగా వెనకేసుకుంటున్నారు.


రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సమూల మార్పులకు జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థల్ని మెరుగు పర్చింది. ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టింది. పాత భవనాల స్థానంలో కొత్త వాటిని నిర్మించింది. అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులిచ్చింది. నాడు నేడు పేరిట గత మూడేళ్ళలో పెద్దసంఖ్యలో ప్రభుత్వ విద్యాసంస్థల ఆధునీకరణ జరిగింది. అదే సమయంలో దీర్ఘకాలంగా ప్రభుత్వ సహకారం తో నిర్వహిస్తున్న ఎయిడెడ్‌ పాఠశాలలపై వేటేసింది. వీటిలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బందికి ప్రభుత్వం దీర్ఘకాలంగా చెల్లిస్తున్న వేతనాల్ని, ఈసంస్థలకిస్తున్న ఆర్ధిక సహకారాన్ని అర్ధాంతరంగా నిలిపేసింది. కొందరు ఉపాధ్యాయుల్ని ప్రభుత్వం విలీనం చేసుకుంది. మిగిలిన ఉపాధ్యాయుల్తో పాటు ఉపాధ్యాయేతర సిబ్బందిని గాలికొదిలే సింది. అలాగే ఆయా విద్యాసంస్థల నిర్వహణా బాధ్యతనుంచి పూర్తిగా తప్పుకుంది. అంతవరకు చెల్లించిన జీతాలు, చేసిన ఆర్ధిక సాయానికి పుల్‌స్టాప్‌ పెట్టేసింది. సొంత వనరుల్తో విద్యాసంస్థల్ని నిర్వహించుకోవాల్సిందిగా సొసైటీలకు సూచించింది. కాగా తాము సొంత వనరుల్తో విద్యాసంస్థల్ని నిర్వహించలేమంటూ చేతులెత్తేసిన సొసైటీల నిర్వాహకులకు సంబంధిత ఆస్తుల్ని తెగనమ్ముకునే అధికారాన్ని కట్టబెట్టింది.

స్వతంత్య్రమొచ్చిన తొలిరోజుల్లో విద్యారంగం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోనే ఉండేది. కానీ పెరుగుతున్న అవసరాలకనుగుణంగా ప్రైవేటు రంగాన్ని కూడా ప్రభుత్వం ఈ దిశగా ప్రోత్సహించింది. అయితే లాభాపేక్ష లేకుండా కొందరు విద్యావంతులు, ప్రముఖులు ఉదాత్త ఆశయం కలిగిన వ్యక్తుల్తో కూడిన సొసైటీలకు మాత్రమే విద్యాసంస్థల నిర్వహణకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇలా రాష్ట్రంలో కొన్ని వందల సొసైటీలు ఏర్పాటయ్యాయి. తమ పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఆస్తులు, తాము వివిధ మార్గాల్లో సంపాదించిన సంపదలో కొంత భాగాన్ని సమాజ ఉద్దరణ లక్ష్యానికనుగుణంగా విద్యాసొసైటీలకు వీరుమళ్ళించారు. ఈ సొసైటీల ద్వారా విద్యాసంస్థల్ని నిర్వహించడం మొదలెట్టారు. ఆదిలో వీటి నిర్వహణ ఆర్ధికంగా వెసులుబాటయ్యేదికాదు. దీంతో ప్రభుత్వమే కొందరు ఉపాధ్యాయులు, సిబ్బందికి నేరుగా జీతాలివ్వడం మొదలెట్టింది. అలాగే విద్యాసంస్థల నిర్వహణ కోసం కూడా ఆర్దిక సహకారం అందించేది. ఇలా సొసైటీల ఆధ్వర్యంలో కొనసాగిన విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యాసంస్థలకు ధీటుగా విద్యార్ధుల్ని తీర్చిదిద్దాయి. అనంతర కాలంలో ఏర్పాటైన ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్తో సరిసమానంగా మెరుగైన ఫలితాల్నిసాధిం చేవి.
అయితే జగన్‌ అధికారంలోకొచ్చాక విద్యారంగంపై ప్రత్యేక దృష్టిపె ట్టారు. ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపర్చారు. ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యారంగంపై ఉక్కుపాదం మోపారు. రాష్ట్రంలో వేళ్ళూనుకుపోయిన ఎడ్యుకేషన్‌ మాఫియాను అణగదొక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. పనిలో పనిగా ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై కూడా వేటేసేశారు.
అయితే ఇలా ఎయిడెడ్‌ సంస్థలకు ఆర్ధిక సహకారం అందించాల్సిన ప్రభుత్వం ఆయా సంస్థల ఆస్తుల విషయంలో దాతల వారసులకనుకూలమైన నిర్ణయాన్ని ప్రకటించింది. తమ తాతలు, తండ్రుల వారసులుగా ఈ సొసైటీలకు ప్రస్తుత తరం చైర్మన్లుగా, కార్యనిర్వాహక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇతర సభ్యుల వారసులు కూడా ఇదే తరహా బాధ్యతల్లో ఉన్నారు. ప్రభుత్వం ఎంతగా ఆర్దికసాయం అందించినా విద్యాసంస్థల నిర్వహణ కేవలం సామాజిక బాధ్యత తప్ప అంతకుమించి వీరికి పెద్దగా దీనిపై ఆదాయం సమకూరేదికాదు. కేవలం ప్రతిష్టగానే వీటిని పరిగణించేవారు. పైగా తమ తాతలు, తండ్రులు దూరదృష్టి లేకుండా అత్యంత విలువైనస్థలాలు, భూముల్ని ఈ విద్యాసంస్థలకు అప్పనంగా కట్టబెట్టేశారంటూ తరచూ ఆవేదన చెందేవారు. వీలుంటే వారసుల హోదాలో వాటిని తెగనమ్ముకోవాలని అభిలషించేవారు. వీరందరికి జగన్‌ ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఇప్పుడు ఒక్కొక్కటిగా ఈ సొసైటీల ఆస్తులు అన్యాక్రాంతమైపోతున్నాయి. లక్షలు, కోట్ల విలువ పలుకుతున్న ఈ ఆస్తుల్ని వారసులు పబ్లిగ్గా తెగనమ్ముకుంటున్నారు. ఒకప్పుడు పెద్దగా విలువలేని స్థలాలు కూడా ఇప్పుడు కోట్లలో పలుకుతున్నాయి. దీంతో దాతల ఆశయాలు నీరుగారిపోతున్నాయి. వారసులు కోట్లకు పడగలెత్తుతున్నారు. జాతీయ సంపదగా మారాల్సిన సొసైటీల ఆస్తులు ప్రైవేటు పరమౌతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కోన్ని వేల కోట్ల విలువైన ఆస్తులు ఈ విద్యాసొసైటీలకున్నాయి. ఈ సొసైటీలన్నీ సమాజ సేవా దృక్పధంతో ఏర్పాటయ్యాయి. వీటిని ప్రభుత్వం జాతీయ సంపదగా ప్రకటించాలి. వీటిలో ప్రభుత్వ విద్యాసంస్థల్ని నిర్వహించాలని సామాజిక నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement