Monday, March 25, 2024

Big Story | చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల్లో వేగం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాళేశ్వరం ప్రాజెక్టుతో అద్భుతాలను ఆవిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వం చిన్నకాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో నిమగ్నమైంది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్‌, కాటారం, మహాముత్తారం, మల్హర్‌ మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు చిన్నకాళేశ్వరం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇవ్వడంతో పాటుగా భూసేకరణ పనులను దాదాపుగా పూర్తి చేసి నిర్మాణాల్లో నిమగ్నమైంది. ముక్తేశ్వరం ఎత్తిపోతల పథకం (చిన్నకాళేశ్వరం) పేరుతో పనుల్లోవేగం పెంచింది. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సాంకేతికపరమైన అనుతులు సాధించి,కేంద్ర జలసంఘం, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుతితో ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచింది. అయితే మహాదేవపూర్‌ మండలం బీరసాగర్‌లో 2008 సెప్టెంబర్‌ 19న నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు తీసుకువచ్చి రూ.500 కోట్లు మంజూరుచేసి కాంట్రాక్టర్లకు అడ్వాన్సులు ఇచ్చి నాలుగు ఏళ్లలో పూర్తి చేయాలని ఆదేశించారు.

అయితే ప్రతిపాదనలు బాగున్నా అనుమతులు సాధించక, మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకోలేక పోవడంతో వివాదాలమధ్య ఈ ప్రాజెక్టు ఇరుక్కుపోయింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానె ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్రతో ఒప్పందాలు చేసుకుని కాళేశ్వరం నిర్మించి ఉత్తరతెలంగాణను సస్యశ్యామలం చేశారు. ఈ నేపథ్యంలో దట్టమైన అడవి ప్రాంతాల్లోని జనావాసాలకు, సాగుభూమికి నీరు అందించే లక్ష్యంతో చిన్నకాళేశ్వరం పథకాన్ని సవరించి ఆధునిక ఇంజనీరింగ్‌ నైపుణ్యంతో నిర్మాణం తలపెట్టారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంకోసం అంచెనావ్యాయాన్ని సవరించి రూ. 632 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చి పనుల్లో వేగం పెంచారు.

- Advertisement -

గోదావరి ప్రాణహిత,మానేరు నదుల సంగమం అనంతరం మేడిగడ్డ బారేజీఎగువన గోదావరినది లో లభ్యంగా ఉన్న నీటిని వినియోగించడం ద్వారా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 45వేల 280 ఎకరాల విస్తీర్ణానికి సాగునీటి సౌర్యాలను కల్పించడానికి కరువుపీడిత ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలతో ఇంజనీర్లు పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ప్రాజెక్టు నిర్మాణంలోని ప్రధాన సమస్య భూసేకరణ. ప్రాజెక్టునిర్మాణం కోసం 258.028 హెక్టార్ల భూమిసేకరించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డీపీఆర్‌లో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తీసుకునే చర్యలను స్పష్టం చేయడంతో అటవీ మంత్రిత్వ శాఖ అటవీ భూముల సేకరణకు అనుమతి ఇవ్వడంతో పనుల్లో వేగం పెరిగింది.

ప్రస్తుతం బీరసాగర్‌ పంపుహౌజ్‌ పరిధిలో 44.45 కిలోమీటర్ల మేర పైపులైను పనులు, కాటారం పంపుహౌజ్‌ పరిధిలో 22.67 కిలోమీటర్ల పనుల్లో 17 కిలోమీటర్ల పనులు పూర్తి అయ్యాయి. కాటారం, మహాదేవపూర్‌, మహాముత్తారం, మల్హర్‌ మండలాల్లో 14 చెరువులకు పైపులైనుద్వారా నీటిని ఎత్తిపోసే పనులు కొనసాగుతున్నాయి. దాదాపుగా 80 శాతం పనులు పూర్తి అయిన చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ఆగస్టులో ప్రారంభించేందుకు సాగునీటి పారుదల శాఖ నిరంతంరం శ్రమిస్తోంది.ఈ ప్రాజెక్టు నిర్మాణంతో దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఎగువనున్న వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరు అందే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement