Wednesday, April 24, 2024

Delhi: రాహుల్ గాంధీకి స్వల్ప ఉపశమనం.. ఈడీ విచారణకు ఒక రోజు విరామం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: వరుసగా మూడు రోజుల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) విచారణ ఎదుర్కొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఒక్క రోజు విరామం లభించింది. శుక్రవారం యధావిధిగా మళ్లీ విచారణ కు హాజరుకావాలంటూ ఈడీ సమన్లు జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో 21 గంటల పాటు సాగిన విచారణకు, బుధవారం నాటి 9 గంటల విచారణ కలిపితే మొత్తం 30 గంటల పాటు రాహుల్ గాంధీ ఈడీ కార్యాలయంలో గడపాల్సి వచ్చింది. బుధవారం ఉదయం గం. 11.35కు ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకోగా, ఆయన వెంట సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా వెంట వచ్చారు.

అయితే ఈడీ కార్యాలయం దగ్గర రాహుల్‌ను దింపి ఆమె వెనుదిరిగారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం ప్రకారం ఈడీ అధికారులు రాహుల్ గాంధీ నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అనేకాంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నాపత్రాన్ని రాహుల్ గాంధీకి అందజేసి, వాటికి లిఖితపూర్వక సమాధానాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో బుధవారం కూడా రాహుల్ గాంధీ తన రాతపూర్వక వాంగ్మూలాన్ని ఈడీ అధికారులకు సమర్పించే ముందు ఒకటికి పదిసార్లు నిశితంగా పునఃపరిశీలించుకున్నట్టు తెలిసింది.

ఎందుకంటే, ఇతర కేసుల మాదిరి కాకుండా పీఎంఎల్ఏ ప్రకారం నమోదు చేసే వాంగ్మూలాలను న్యాయస్థానం నేరుగా పరిగణలోకి తీసుకుంటుంది. ఈ క్రమంలో ఈడీ అధికారులకు ఇచ్చిన సమాధానాలను కోర్టు ఎదుట ఇచ్చిన వాంగ్మూలాలుగా పరిగణించాల్సి ఉంటుంది. అందుకే రాహుల్ గాంధీ మూడు రోజుల విచారణలో ప్రశ్నలకు సమాధానాలు రాయడం కంటే వాటిని సమీక్షించేందుకు, పునఃపరిశీలించేందుకే ఎక్కువ సమయం తీసుకుంటున్నారని ఈడీ వర్గాల ద్వారా తెలిసింది.

ఈడీ విచారణలో ప్రధానంగా నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహించిన సంస్థ ‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)’కు చెందిన రూ. 90.25 కోట్ల రుణాన్ని వసూలు చేసే హక్కును ‘యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్’ (వైఐఎల్) కంపెనీకి బదలాయించడం, ఈ క్రమంలో ఏజేఎల్ షేర్లను వైఐఎల్‌కు బదలాయించడంపై లోతుగా ప్రశ్నించినట్టు తెలిసింది. నిజానికి రూ. 2,000 కోట్లకు పైగా స్థిరాస్తులను కలిగిన ఏజేఎల్ సంస్థ, తాను చెల్లించాల్సిన రూ. 90.25 కోట్ల రుణానికి ఏదో ఒక స్థిరాస్తిని అమ్మి అప్పు తీర్చే అవకాశం ఉంది. కానీ అలా చేయకుండా ఏజేఎల్ కంపెనీ షేర్లను బదలాయించడం ద్వారా మొత్తం రూ. 2,000 కోట్ల ఆస్తులపై హక్కులను వైఐఎల్ కు అప్పగించినట్టయింది.

రూ. 5 లక్షల మూలధనంతో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియన్ సంస్థ ఏకంగా రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అప్పనంగా కాజేసినట్టయింది. యంగ్ ఇండియన్ సంస్థలో ప్రధాన వాటాదారులుగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. అందుకే ఈడీ ఈ ఇద్దరికీ సమన్లు జారీ చేసి విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న సోనియా గాంధీ విచారణకు హాజరుకాకపోయినా, రాహుల్ గాంధీ వరుసగా 3 రోజుల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. అయితే ఈ విచారణను కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయాలుగా పేర్కొంటూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా మూడు రోజుల నుంచి ధర్నాలు, నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement